కరోనా రెండో దశ వ్యాప్తి ఉద్ధృతంగా ఉంది. నిత్యం అనేక మంది వైరస్ బారిన పడుతున్నారు. మరెంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో ఏఐజీ ఆసుపత్రుల ఆధ్వర్యంలో వైద్యుల బృందం పరిశీలన చేసింది. కరోనా రెండో దశలో యువతపై ఎక్కువగా ప్రభావం ఉన్నట్లు పరిశీలనలో తేలింది. రాబోయే రోజుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 50 లక్షలకు చేరుకునే అవకాశం ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. వైరస్ మ్యూటెంట్ చెందడం, వాక్సిన్ ఎక్కువ మంది తీసుకోకపోవడం కారణంగా మారినట్లు అభిప్రాయపడ్డారు.
కానీ... రోగం కన్నా భయమే చాలా మందిలో ప్రాణాలు తీస్తోందని వైద్యుల వారు పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న మరణాల వార్తలు, సొంత వైద్యం చిట్కాలు , లేనిపోని అపోహలతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని ఏఐజీ ఆస్పత్రుల ఛైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. ఏడాది కాలంగా 20వేల మంది కొవిడ్ రోగులకు తమ ఆస్పత్రిలో వైద్యం అందించిన అనుభవంతో వారు ఓ ప్రొటోకాల్ రూపొందించారు. దేశంలో , రాష్ట్రంలో అనుసరిస్తున్న విధానాలు, స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీ పరిశీలించాకే తాము ఈ ప్రొటోకాల్ రూపొందించామని ఏఐజీ ఛైర్మన్ నాగేశ్వర్ రెడ్డి తెలిపారు.
ప్రజలు అయోమయానికి గురవుతున్నారు...
సామాజిక మాధ్యమాల్లో అనేక అపనమ్మకాలు, పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. వీటి ద్వారా ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. భయం పెంచుకుని నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారు. ఈ సమస్య పరిష్కారంతో పాటు వైద్యులకు సూచనలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఏఐజీ ఆస్పత్రుల ఆధ్వర్యంలో ప్రొటోకాల్ తీసుకొచ్చాం. ప్రజలు, వైద్యులు తెలుసుకోవాల్సిన విషయాలను శాస్త్రీయ ఆధారాలతో సులభ పద్ధతిలో వివరించాం.
-డా. డి.నాగేశ్వర్ రెడ్డి, ఏఐజీ ఆస్పత్రుల ఛైర్మన్
ఏఐజీ ఆస్పత్రుల ప్రొటోకాల్ ప్రకారం.. కరోనా అనుమానిత లక్షణాలుంటే.. వెంటనే పరీక్ష చేయించుకోవాలి. పాజిటివ్‌గా తేలి స్పల్వ లక్షణాలు ఉంటే హోమ్ ఐసోలేషన్‌లో ఉండాలి. ఇంట్లో థర్మామీటర్, ఆక్సీమీటర్ అందుబాటులో ఉంచుకోవాలి. రక్తపోటు, చక్కెర వ్యాధి ఉన్న వాళ్లు బీపీ, గ్లూకోజ్ మానిటర్ ఇంట్లో ఉంచుకోవాలి. ప్రతి 8 గంటలకు ఒకసారి జ్వరం, ప్రతి నాలుగు గంటలకు ఒకసారి ఆక్సిజన్ శాతం పరీక్షించుకోవాలి.
సాధారణంగా ఒకసారి... 6 నిమిషాలు నడిచిన తర్వాత మరోసారి ఆక్సిజన్ శాతం పరీక్షించుకోవాలి. 94 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. 90కి పడిపోతే అప్రమత్తమవ్వాలి. ప్రతి రెండు గంటలకు ఒకసారి పరీక్షించుకొని 90 పాయింట్లకు మించి రాకపోతే ఆస్పత్రిని సంప్రదించాలి. స్పల్ప లక్షణాలుంటే వైద్యుల సలహా మేరకు పారాసిటమాల్- 650, విటమిన్ డీ, విటమిన్ సీ మాత్రలు... అవసరాన్ని బట్టి బుడెసోనైడ్ ఇన్‌హేలర్ తీసుకోవాలి. మూడు రోజుల పాటు ఆయాసం, జ్వరం, రక్తపోటు పడిపోయినా ఆస్పత్రికి వెళ్లాలి.
ఏఐజీ ప్రొటోకాల్‌లో వైద్యులకూ పలు సూచనలు చేశారు. ప్రతి ఒక్కరికీ రెమిడెసివిర్ ఇంజక్షన్ ఇవ్వడం వల్ల ఉపయోగం ఉండదని... తీవ్రతను బట్టి అందించాలని సూచించారు. శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది పడే కరోనా రోగులకు డెక్సామెథసోన్ ఔషధంతో మంచి ఫలితాలుంటాయని పేర్కొన్నారు. టోసిలిజుమాబ్ ... కరోనా తీవ్రరూపం దాల్చిన సందర్భంలో మాత్రమే ఇవ్వాలని సూచించారు. స్వీయ నిర్బంధం, వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా కరోనాను అరికట్టవచ్చని సూచించారు.
ఇదీ చదవండి: