సింగ్‌నగర్‌కి చెందిన 38 ఏళ్ల ఆటో డ్రైవర్‌కు కరోనా సోకింది. నెల కష్టపడితే ఆయనకు వచ్చేది రూ.30వేలు. భార్య, కొడుకు, కూతురితో కలిసి అద్దె ఇంట్లో జీవనం సాగిస్తున్నారు. నెలకు రూ.4వేలు అద్దె చెల్లిస్తారు. కుటుంబ అవసరాల నిమిత్తం నెలకు మరో రూ.5వేలు ఖర్చు చేస్తారు. ఇన్సూరెన్స్‌లు, చిటీలు, వడ్డీల నిమిత్తం నెలకు మరో రూ.10వేలు ఖర్చు చేస్తారు. పిల్లల చదువులకు రూ.4వేలు ఖర్చు చేస్తారు. మిగిలిన డబ్బును అత్యవసరాల నిమిత్తం పొదుపు చేస్తారు. ఆ ఆటో డ్రైవర్‌కు కరోనా సోకడంతో కుటుంబం ఆర్థికంగా చతికిలపడింది. ఓ ప్రైవేటు ల్యాబ్‌లో రూ.4వేలు ఖర్చు చేసి సీటీ స్కాన్ చేయించారు. పాజిటివ్ అని నిర్ధారణ జరిగింది. ఓ ఆర్‌ఎంపీని కలవగా రూ.500 తీసుకుని కోర్సు చెప్పారు. కరోనా మందులకు, ఆక్సిమీటర్‌కు రూ.5వేలు ఖర్చు చేశారు. 8వ రోజు పరిస్థితి విషమించడంతో స్థానికంగా ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. రూ.1.6లక్షలు కట్టారు. నాలుగు రోజులు గడిచాక పరిస్థితి విషమించడంతో ప్రైవేటు ఆసుపత్రి వర్గాలు చేెతులెత్తేశాయి. దీంతో జీజీహెచ్‌లో చేర్పించారు.
విజయవాడ నగరం పటమటకి చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి భార్య, ఇద్దరు కుమారులతో కలిసి అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. ఆయన జీతం నెలకు రూ.38వేలు. ఇంటి అద్దె రూ.5500 చెల్లిస్తారు. కూరలు, పచారీ సరకుల నిమిత్తం నెలకు రూ.5వేలు ఖర్చు చేస్తారు. నెలకు కట్టే లోన్లు, బీమా పాలసీల నిమిత్తం మరో రూ.5వేలు తీయాల్సిందే. పిల్లల చదువు, ఇంట్లో ఇతర అవసరాల కోసం రూ.4వేలు పక్కన పెడతారు. కూరల కోసం రైతుబజార్‌కు వెళ్తే ఆయన భార్యకు కరోనా సోకింది. ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోగా నాలుగు రోజులైనా ఫలితం రాలేదు. దీంతో రూ.4500 చెల్లించి సీటీ స్కాన్ చేయించారు. అందులో కరోనా పాజిటివ్ అని తెలింది. కరోనా కాటుతో ఆయన ఇంటి బడ్జెట్ తలకిందులైంది. భార్యకు మందులు, పల్స్ ఆక్సీమీటర్‌కు మొదటి నాలుగు రోజుల్లో రూ.6వేలు ఖర్చు చేశారు. ఐదు రోజులైనా జ్వరం తగ్గకపోవడం, శ్వాస సంబంధ సమస్యలు తలెత్తడంతో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. 5 రోజుల వైద్యానికి రూ.2లక్షలు బిల్లు వేశారు. బంధువుల నుంచి రూ.1.5లక్షలు అప్పు చేసి, మిగిలింది పొదుపు నుంచి తీసి బిల్లు చెల్లించారు. కరోనా ఆ కుటుంబాన్ని అప్పుల ఊబిలోకి నెట్టింది.
విజయవాడ రామవరప్పాడుకి చెందిన ఓ కుటుంబం మొత్తం కరోనా బారిన పడ్డారు. ఆ కుటుంబంలో తల్లి, తండ్రి, కూతురు, కొడుకు, కోడలు నివసిస్తారు. తండ్రి, కుమార్తె, కుమారుడు కలిపి నెలకు రూ.50వేలు సంపాదిస్తారు. ఆ కుటుంబం మొత్తం రూ.15వేల అద్దె ఇంటిలో నివసిస్తున్నారు. ఇంట్లో పచారీ సరకులు, ఇతర అవసరాలకు నెలకు రూ.10వేలు ఖర్చు చేస్తారు. బీమా, వడ్డీలు, చీటీలు కలిపి నెలకు రూ.10వేలు ఖర్చు చేస్తారు. పిల్లలు, ఇతర అవసరాలకు నెలకు రూ.5వేలు ఖర్చు చేస్తారు. మిగిలినది అత్యవసరాల సమయంలో వెచ్చించేందుకు దాచుకుంటారు. ఆ కుటుంబం మొత్తం కరోనా బారిన పడింది. నెల రోజుల నుంచి ఇంట్లో ఎవరూ పనికి వెళ్లడం లేదు. దాచుకున్న డబ్బుల నుంచి మందులకు రూ.8వేలు ఖర్చు చేశారు. ఎక్స్‌రేలకు, సీటీ స్కాన్‌లకు రూ.5వేలు ఖర్చు చేశారు. ఒకరు కోలుకోగా పెద్ద దిక్కుగా ఉన్న ఆ తండ్రి కరోనా బారినపడి మరణించారు. ఆ కుటుంబంలో కరోనా తీవ్ర విషాదం మిగల్చడమే కాకుండా ఆర్థికంగా రోడ్డున పడేసింది.
కనిపించని శత్రువు కరోనా ఊహించని ఉపద్రవాన్ని తెచ్చిపెట్టింది. కరోనా మొదటి దశలో వైరస్ చిక్కి ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలు కోలుకోక ముందే మళ్లీ దెబ్బ తగిలింది. మరోవైపు రెండో దశలోనూ ఉపాధిపై వైరస్ తీవ్ర ప్రభావం చూపుతోంది. మధ్య తరగతి కుటుంబం బడ్జెట్‌లో వైద్య ఖర్చులకు 15 నుంచి 25 శాతం వరకు పక్కన పెడతారు. కరోనా బారిన పడితే ఖర్చు ముందుగా అనుకున్న బడ్జెట్ కంటే 150 నుంచి 200 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ప్రతి 10 కుటుంబాలకు ఒక కుటుంబం కరోనా భయంతో పరీక్షలకు వెళ్తోంది. వైరస్ బారిన పడితే కోలుకునే సరికి రూ.లక్షలు ఖర్చు అవుతున్నాయి. అప్పులు ఎలా తీర్చాలని బెంగ పెట్టుకునే పరిస్థితి ఉంది.
- ఐదారుగురు ఉన్న ఇంట్లో ఒకరు కరోనా బారిన పడినా పోషహాకారం, ముందు జాగ్రత్తగా వాడే ఔషధాలకు కలిపి ఒక్కొక్కరికి రూ.25 వేలు నుంచి రూ.30 వేలు ఖర్చు చేయాల్సి వస్తుంది. అందరూ 10 నుంచి 14 రోజుల వరకు ఇంట్లోనే ఉండిపోతున్నారు. కాయకష్టంతో దాచుకున్న కొద్దిపాటి నగదు కరోనా చికిత్సకు ఖర్చు చేయడంతో ఆహారానికి సైతం ఇబ్బంది పడుతున్నారు.
- స్వల్ప లక్షణాలతో కరోనా బారిన పడి హోం ఐసోలేషన్‌లో ఉన్నా ఆరోగ్యవంతులయ్యేందుకు ఒక్కో వ్యక్తికి రూ.15 వేలు నుంచి రూ.20 వేలు వరకు ఖర్చవుతోంది. చాలా మంది ప్రైవేటుగా ర్యాపిడ్, సీటీ స్కానింగ్ పరీక్షలు చేయించుకుంటున్నారు. ఆ రెండింటికీ కలిపి రూ.5 వేలు ఖర్చవుతోంది. ఔషధాలు, పోషకాహారం కలిపి రెండు వారాలకు రూ.10 వేలకు పైగా ఖర్చు దాటుతోంది.
- నెలవారీ వేతనంపై ఆధారపడి జీవించే మధ్యతరగతి కుటుంబాల్లో ఎవరైనా కరోనా బారిన పడితే వారి ఇబ్బందులు వర్ణనాతీతం. ప్రైవేట్‌లో కరోనా చికిత్సకు రూ.1.50 లక్షల నుంచి రూ.10 లక్షలకు పైగా వసూలు చేస్తున్నారు. అప్పటికప్పుడు ఆ నగదు తెచ్చి ఖర్చు చేయడం ఒక సమస్య అయితే, ఆ ఉద్యోగి సెలవులో ఉండటంతో నెలవారీ వేతనం అందక కుటుంబ బడ్జెట్ తల్లకిందులయ్యే పరిస్థితులు ఉన్నాయి.
- చిరు వ్యాపారులు, రోజువారీ కూలి పనులపై ఆధారపడి జీవించే వారు సైతం కరోనాతో విలవిల్లాడుతున్నారు. పని కోల్పోయి.. అప్పుల పాలై.. ఆరోగ్యం కుదుటపడేందుకు అవసరమైన వైద్యసేవలు పొందడం కష్టంగా మారింది.
ఇదీ చదవండీ… సిక్కు స్నేహితునికి.. అంత్యక్రియలు చేసిన ముస్లింలు