‘‘సార్ మా ఊరికి విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాలు, వేరే ప్రాంతాల నుంచి ఇటీవల కొంతమంది వచ్చారు. వారికి కరోనా లక్షణాలున్నట్లు అనుమానం ఉంది. వారిని క్వారంటైన్‌కు తీసుకెళ్లాలే చర్యలు తీసుకోరు’’ అంటూ డయల్ 100కు కాల్స్ వెల్లువెత్తుతున్నాయి. మార్చి 22వ తేదీ నుంచి ఈనెల 14వరకూ 2,520 ఇలాంటి కాల్స్ వచ్చాయి. వీటిల్లో 70శాతం కాల్స్ మార్చి 31 లోపు వచ్చినవే. లాక్‌డౌన్ నేపథ్యంలో రాకపోకలకు అవకాశం లేకపోవటంతో క్రమంగా ఇలాంటి ఫిర్యాదుల సంఖ్య తగ్గుతోంది. ఈ నెల ప్రారంభంలో సగటున రోజుకు 80-100 వరకూ కాల్స్ వచ్చేవి. నాలుగైదు రోజులుగా 20-30 కాల్సే వస్తున్నాయి. ఇప్పటివరకూ వచ్చిన మొత్తం కాల్స్‌లో అనంతపురం, కృష్ణా, శ్రీకాకుళం జిల్లాల నుంచే అధికంగా ఫిర్యాదులందాయి. ఈ సమాచారం ఆధారంగా వారందర్నీ గుర్తించి క్వారంటైన్‌కు తరలిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు.
వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా గుర్తించిన వారు
- ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి ఏపీకి వచ్చిన వారు: 2,491 మంది.
- వీరిలో అత్యధికంగా 701 మంది హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి 317, దిల్లీ నుంచి 295, మహారాష్ట్ర నుంచి 197, చెన్నై నుంచి 141 మంది వచ్చారు. రాష్ట్రంలోనే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి 489 మంది వెళ్లారు.
- ఇతర దేశాల నుంచి ఏపీకి వచ్చిన వారు: 427
- వీరిలో అత్యధికంగా దుబాయ్ నుంచి 147 మంది, అమెరికా నుంచి 94, ఇటలీ నుంచి 25, కువైట్, సింగపూర్‌ల నుంచి 19 మంది చొప్పున వచ్చారు. మిగిలిన వారు ఇతర దేశాల నుంచి వచ్చారు.
ఇదీ చదవండి: రోజుకు 17 వేల మందికి కరోనా పరీక్షలే లక్ష్యం