వంటనూనె ధర భారీగా పెరిగింది. వీటిపై సుంకం విధిస్తున్నట్లు కేంద్ర బడ్జెట్లో ప్రకటించడంతో ధర అమాంతం పెరిగింది. ఇంతకాలం ముడి పామాయిల్‌పై కేంద్రం వసూలుచేస్తున్న సుంకం 27.50 శాతంగా ఉండేది. తాజాగా అది 35.75కి పెరిగిందని... ఈ ప్రభావం చిల్లర ధరలపై పడిందని నూనె మిల్లుల వ్యాపారులు తెలిపారు. ముడి సోయా, పొద్దుతిరుగుడు నూనెలపైనా సుంకం పెంచినా ఆ మేరకు పాత సుంకాలను కొంత తగ్గించడంతో వాటి ధరలు తక్షణం పెరగలేదు.
అధిక విక్రయాలు ఇవే..
రాష్ట్రంలో అన్నింటికన్నా పామాయిల్ విక్రయాలే అధికం. రాష్ట్ర ప్రభుత్వ ‘విజయ’ బ్రాండు వంటనూనెలను నెలకు 2,500 టన్నుల వరకూ ‘రాష్ట్ర నూనెగింజల ఉత్పత్తిదారుల సహకార సమాఖ్య’(ఆయిల్‌ఫెడ్) విక్రయిస్తోంది. ఇందులో పామాయిల్ ఒక్కటే 800 టన్నులకు పైగా ఉంది. మిగతావన్నీ కలిపి 1,700 టన్నులుంటాయి. మిగిలిన వాటితో పోలిస్తే తక్కువ ధరకు వస్తుండటంతో ఎక్కువమంది గృహ వినియోగదారులు, హోటళ్లు, వీధి వ్యాపారులు, వేడుకలు వంటి వాటిలో ఆహార పదార్థాల తయారీకి దీన్నే ఎక్కువగా వినియోగిస్తారు. ఇప్పుడు పొద్దుతిరుగుడు, వేరుసెనగ నూనెల ధరలు దాదాపు సమానమయ్యాయని వినియోగదారులు వాపోతున్నారు. స్థానికంగా పామాయిల్ సాగు గిరాకీకి తగ్గట్టుగా లేకపోవడం, చైనా దిగుమతులపై ఆధారపడటం కూడా ధరల పెరుగుదలకు కారణమని ఆయిల్‌ఫెడ్ మార్కెటింగ్ మేనేజర్ తిరుమలేశ్వర్‌రెడ్డి ‘చెప్పారు. నువ్వుల నూనె ధర రికార్డుస్థాయిలో టన్నుకు రూ.2.48 లక్షలకు చేరింది.
పొంచిఉన్న కల్తీ ముప్పు
ధరలు పెరిగిన నేపథ్యంలో కల్తీ ముప్పు పొంచి ఉందని ఆయిల్‌ఫెడ్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. పత్తి గింజల నూనెతో ఇతర వంట నూనెలను కల్తీచేసే అవకాశం ఉందన్నాయి. ఈ కారణంగానే పత్తిగింజల నూనె టన్ను ధర ఇటీవల రూ.లక్షా ఐదు వేలకు చేరిందని ఉదహరిస్తున్నాయి. ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని సక్రమంగా ప్యాక్ చేసిన బ్రాండ్ నూనెలనే కొనాలని, విడి(లూజు)గా కొనొద్దని సూచిస్తున్నాయి.
ఇదీ చూడండి: ఎన్నికల నిర్వహణపై నిఘా వ్యవస్థ: ఎస్ఈసీ