జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో నామినేషన్ల బలవంతపు ఉపసంహరణలు, అడ్డగింతలపై ఎస్ఈసీ విచారణకు ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు రద్దు చేసింది. ఏకగ్రీవాలను నిబంధనలను అనుసరించి ప్రకటించాలని తెలిపింది. ఏకగ్రీవాలపై అభ్యంతరాలుంటే ఎన్నికల ట్రైబ్యునల్‌ను ఆశ్రయించవచ్చని పేర్కొంది. ఎన్నికల విధుల్లో నిష్పాక్షికంగా వ్యవహరించని అధికారులు, సిబ్బంది లోపాల్ని సరిదిద్దుకునేందుకు, మరింత మెరుగ్గా ఎన్నికలు నిర్వహించే విషయంలో విచారణలను కొనసాగించి.. సమాచారాన్ని సమకూర్చుకునేందుకు ఎస్ఈసీకి న్యాయస్థానం అనుమతి ఇస్తున్నట్లు తెలిపింది.
అధికారులపై చర్యలు నిబంధనల మేరకు ఉండాలని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. విచారణ జరిపిన డేటాను ఎస్ఈసీ స్వీయ అవసరాలకు లేదా చట్టాలు, నిబంధనలను సవరించే నిమిత్తం.. కేంద్ర ఎన్నికల సంఘానికి, చట్టసభలు, పార్లమెంట్‌కు పంపవచ్చని పేర్కొంది. స్వేచ్ఛగా, నిష్పాక్షిక ఎన్నికల నిర్వహణ ప్రజాస్వామ్యానికి పునాది అని సుప్రీంకోర్టు పలుమార్లు స్పష్టం చేసిందని గుర్తుచేసింది. నిష్పాక్షికంగా విధులు నిర్వర్తించని అధికారులు, సిబ్బంది విషయంలో సర్వోన్నత న్యాయస్థానం సైతం అసంతృప్తి వ్యక్తం చేసిందని తెలిపింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు ఈ మేరకు తీర్పు ఇచ్చారు.
తీర్పు వెల్లడి అనంతరం... రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్, ప్రభుత్వ న్యాయవాది సుమన్ స్పందిస్తూ.. న్యాయస్థానంలో వ్యాజ్యాలు పెండింగ్‌లో ఉన్న కారణంగా ఎస్ఈసీ ఎన్నికలు నిర్వహించడం లేదని, ఈ వ్యాజ్యాలు ఎన్నికల నిర్వహణకు అడ్డంకికావు అనే విషయాన్ని నమోదు చేయాలని అభ్యర్థించారు. ఎన్నికల నిర్వహణకు ఆదేశించాలని కోరారు. ఎన్నికల నిర్వహణకు ఈ వ్యాజ్యాలు అడ్డంకికావు అనే విషయాన్ని నమోదు చేయడానికి న్యాయమూర్తి నిరాకరించారు. అలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేశారు. ఎన్నికలు నిర్వహించాలనేది ప్రత్యేక అంశం అని పేర్కొన్నారు.
గతేడాదిలో జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అడ్డగింతల కారణంగా నామినేషన్ వేయలేని వారు, బలవంతం కారణంగా నామినేషన్లను ఉపసంహరించుకున్నవారు ఇచ్చిన ఫిర్యాదులపై విచారణ జరపాలని, బలవంతపు ఉపసంహరణ వాస్తవం అని తేలితే నామినేషన్ల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఎస్ఈసీ గత నెల 18న ఆదేశించింది. ఎస్ఈసీ ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ... జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఏకగ్రీవమై ఫాం 10 పొందిన పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాలపై ఇటీవల విచారణ జరిపిన న్యాయమూర్తి తీర్పును వెల్లడించారు.
నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని, బలవంతంగా నామినేషన్లను ఉపసంహరించారని పలువురు ఇంప్లీడ్ పిటిషనర్లు చేస్తున్న ఆరోపణలు ఆందోళన కలిగించాయని ధర్మాసనం తీర్పులో పేర్కొంది. అధికరణ 226 కింది ఈ వ్యాజ్యాల్ని విచారిస్తున్న నేపథ్యంలో ఫిర్యాదులు, వాస్తవాల ఆధారంగా నిర్ణయాన్ని వెల్లడించే స్థితిలో న్యాయస్థానం లేదన్నారు. నిష్పాక్షిక ఎన్నికల నిర్వహణ కేవలం నైతికపరమైన బాధ్యతే కాదు.. న్యాయపరంగా సాధించాల్సిన రాజ్యాంగ లక్ష్యమని తెలిపారు. సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో ఎన్నికల స్వచ్ఛతను కాపాడాలని, స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా నిర్వహించాలని చెప్పిందని... ఎస్ఈసీ అధికారాల గురించి చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారని ధర్మాసనం తెలిపింది. ఎన్నికల విషయంలో ఎస్ఈసీ అధికారానికి కేంద్రబిందువని వ్యాఖ్యానించింది.
నిబంధనలు, చట్టాల్లో పేర్కొనని అంశాల్లో ఎస్ఈసీ అధికారాన్ని వినియోగించవచ్చని కోర్టు తెలిపింది. పరిస్థితుల ఆధారంగా తగిన నిర్ణయాలు తీసుకొని ఆదేశాలు ఇవ్వవచ్చని... కోర్టు ముందున్న ప్రస్తుత కేసుల్లో నామినేషన్లు వేయకుండా బెదిరింపులు, బలవంతపు ఉపసంహరణలు జరిగాయని... ఫోర్జరీ సంతకాలతో నామినేషన్లు ఉపసంహరించారనే ఆరోపణలు ఉన్నాయని పేర్కొంది. ఈ చర్యలు ఏకగ్రీవాలకు దారి తీశాయని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలోనే ఎస్ఈసీ... ఎన్నికల్లో అక్రమాలపై దృష్టి పెట్టిందని... బలవంతపు ఉపసంహరణల చోట నామినేషన్ల పునరుద్ధరణకు కలెక్టర్లకు ఆధికారాలిచ్చిందని... ఎస్ఈసీ ఉద్దేశం ప్రశంసనీయమైందని వ్యాఖ్యానించింది. ప్రస్తుత కేసుల్లో నిబంధనలను ఈ దశలో ఎస్ఈసీ జోక్యానికి విరుద్ధంగా ఉన్నాయని ధర్మాసనం తెలిపింది.
నామినేషన్ల దాఖలు నుంచి ఫలితాల ప్రకటన వరకు ఎన్నికల విషయంలో ఉత్పన్నమయ్యే ఏ పిటిషన్ను అయినా ఎస్ఈసీ పరిగణనలోకి తీసుకోవడానికి వీల్లేదని పంచాయతీరాజ్ ఎన్నికల నిబంధన 99 స్పష్టం చేస్తోంది. అలాంటి కేసులను సంబంధిత ట్రైబ్యునల్, కోర్టు తేల్చాలి. మోసం, బెదిరిపులు, బలవంతం చోటు చేసుకున్నట్లు ఎస్ఈసీ అభిప్రాయపడినా... ఎన్నికల ఫలితాల ప్రకటన విషయంలో ఎస్ఈసీకి అధికారం లేదు అనేది కోర్టు అభిప్రాయపడిందని తీర్పులో తెలిపింది. ఒకసారి ఎన్నిక పూర్తయ్యాక.. ఆ వివాదాన్ని ఎన్నికల ట్రైబ్యునల్ తేల్చాలి. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యాక తాజాగా విచారణ జరపాలని కలెక్టర్లను కోరే అధికారం ఎస్ఈసీకి లేదని స్పష్టం చేసింది. బలవంతాలు, బెదిరింపులు, మోసం తదితర వ్యవహారాల్లో స్పష్టమైన ఆధారాలు అవసరం. శిక్షణ పొందిన న్యాయాధికారి మాత్రమే ఆ విషయాన్ని తేల్చగలరని కోర్టు తెలిపింది.
కలెక్టర్లుకు ఎస్ఈసీ రాసిన లేఖ వెనుక ఉద్దేశం, ఆలోచన మొచ్చుకోదగినది అని చెప్పడానికి న్యాయస్థానం ఏమాత్రం సంశయించడం లేదన్నది. ఈ కేసుల్లో నిబంధనలు ఎస్ఈసీకి విరుద్ధంగా ఉన్నాయని... ఫిర్యాదుల్లోని ఆరోపణలు వాస్తవం అని తేలినప్పటికీ.. ఈ విషయంలో ఎస్ఈసీ జోక్యం చేసుకోవడానికి, ఎన్నికను రద్దు చేయడానికి వీల్లేదని అభిప్రాయపడుతున్నామని ధర్మాసనం తీర్పులో పేర్కొంది. ఆ అధికారం కేవలం ఎన్నికల ట్రైబ్యునల్‌కు మాత్రమే ఉందని చెప్పింది. ఈ నేపథ్యంలో వివాదాంశాలను ఎస్ఈసీ లేదా కలెక్టర్లు తేల్చడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యాక ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలంది. వ్యాజ్యాల విచారణ సందర్భంగా ఎస్ఈసీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఎస్ఈసీ లేఖలోని నామినేషన్లను పునరుద్ధరించాలనే పేరా 13ను పరిగణనలోకి తీసుకోకపోతే.. మిగిలినదంతా ఎన్నికల ఇబ్బందుల్ని సరిదిద్దుకుని, నిష్పాక్షిక ఎన్నికల నిర్వహణ నిమిత్తం సమాచారాన్ని సేకరించడంమేనని.. అందుకు కోర్టు అనుమతిస్తోందని తీర్పులో పేర్కొన్నారు.
ఇదీ చదవండీ... చంద్రబాబుకు సీఐడీ నోటీసులు.. ఈ నెల 23న విచారణకు హాజరుకావాలని ఆదేశం