Congress leaders meet Governor: కాంగ్రెస్ ఒత్తిడికి తలొగ్గే రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రతినిధుల బృందం తెలంగాణ గవర్నర్ తమిళిసైని కలిసింది. భేటీలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, వీహెచ్, జగ్గారెడ్డి, గీతారెడ్డి, మధుయాష్కీ గౌడ్, పొన్నం ప్రభాకర్, బలరాం నాయక్, ఇతర నేతలు పాల్గొన్నారు. రైతుల సమస్యలు, ప్రభుత్వ అవకతవకలపై గవర్నర్‌కు నివేదిక ఇచ్చారు. చివరి గింజ వరకు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు.
"రైతుల గుండెలు ఆగిపోతుంటే కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. రాజకీయ ప్రయోజనాల కోసమే ఒకరు గల్లిలో మరొకరు దిల్లీలో ధర్నాలు చేస్తున్నారు. పంట వేయకుండా పడావు పెట్టిన భూములకు ఎకరానికి 15వేల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం పరిహారం చెల్లించాలి. రైతుల సమస్యలపై పూర్తి వివరాలతో గవర్నర్‌కు నివేదిక ఇచ్చాం. పంటలు కొనుగోలు చేయకపోవడం వల్ల రైతులకు రూ.వేల కోట్ల నష్టం వాటిల్లుతుంది. ఇప్పటికే 30 శాతం వరి ధాన్యం దళారులు, మిల్లర్ల చేతిలోకి వెళ్లింది. రైతుల వద్ద మిల్లర్లు క్వింటా రూ.1,300కే కొనుగోలు చేశారు. తక్కువ ధరకు బియ్యం అమ్మడం వల్ల రైతులకు రూ.2 వేల కోట్ల నష్టం వచ్చింది. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం.. క్వింటా ధాన్యంపై రూ.600 బోనస్ ఇప్పించాలి. రైతులకు కనీస మద్దతు ధర ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. మిల్లర్లు, దళారులు కలిసి బియ్యం మాయం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్‌సీఐకి బియ్యం అందించలేదు. రూ.2,600 కోట్ల విలువైన 8.34 లక్షల టన్నుల బియ్యం మాయమయ్యాయి. ఈ ఘటనపై సీబీఐ విచారణ చేయాలి." - రేవంత్రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు
ప్రభుత్వం ప్రతి ధాన్యపు గింజ కొనే వరకు పోరాడుతామని కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. రైతులకు రూ.1960 ఇచ్చినా గిట్టుబాటు కాదని.. కనీస మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోళ్లపై కార్యాచరణ రూపొందించి.. నాలుగు రోజుల్లో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. ధాన్యం కొనుగోలు చేయకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని కోమటిరెడ్డి హెచ్చరించారు.
ఇవీ చూడండి: