కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి.. ఆక్వా రంగంలో బీమా సౌకర్యం కల్పించే అంశాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆక్వా యూనివర్సిటీ పనులను వేగవంతం చేయాలన్నారు. ప్రజారోగ్యంలో ఫ్యామిలీ డాక్టర్ అనే విధానంతో ముందుకెళుతున్నట్లే.. పశువైద్యంలోనూ హేతుబద్ధమైన, పటిష్ఠమైన ప్రోటోకాల్‌తో కూడిన విధానం, వ్యవస్థలు ఉండాలని నిర్దేశించారు. రాష్ట్రవ్యాప్తంగా పశువుల ఆస్పత్రులకు సంబంధించి ‘నాడు- నేడు’ కింద ఏయే పనులు చేయాలో, ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పించాలో ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. తాడేపల్లిలో క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి బుధవారం పశుసంవర్థక, మత్స్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఆక్వా హబ్‌లను స్థానిక మార్కెట్లకు విస్తరించి మత్స్య ఉత్పత్తులు సరసమైన ధరలకే ప్రజలకు అందించాలి. చేపలు, రొయ్యల వంటి వాటి వినియోగం పెరగాలి. దీని వల్ల వినియోగదారులకూ, రైతులకూ మేలు జరుగుతుంది. సీడ్, ఫీడ్‌ల్లో కల్తీ లేకుండా చూడాలి. ఆక్వాలో నాణ్యత తనిఖీలు ఎలా చేయించుకోవాలో అవగాహన కల్పించాలి. సమీకృత ఆక్వా ల్యాబ్‌లపై బాగా ప్రచారం చేయాలి. ఆక్వా పరిశోధన కేంద్రాలు ఇప్పటికే 14 ప్రారంభించాం. మరో 21 నవంబరులో ప్రారంభిస్తాం. వీటిని రైతుభరోసా కేంద్రాలకు అనుసంధానం చేయాలి.
* కేజ్ ఫిష్ పెంపకంతో ఆదాయాలు బాగా పెరుగుతాయి. రాష్ట్రంలో కేజ్ ఫిష్ కల్చర్, మరీ కల్చర్‌పై దృష్టి సారించాలి. ప్రయోగాత్మకంగా చెరో మూడు చోట్ల వీటిని ప్రారంభించాలి.
* పశు సంవర్థకశాఖ డిస్పెన్సనరీల నిర్వహణ హేతుబద్ధంగా ఉండాలి. గ్రామం, మండల, నియోజకవర్గ కేంద్రాల్లో ఉన్న పశు ఆరోగ్య కేంద్రాల్లో ఏమేం వసతులు అవసరమో తెలుసుకోవాలి. స్పష్టమైన కార్యాచరణ రూపొందించుకుని వాటిని మెరుగ్గా నిర్వహించాలి. రైతుభరోసా కేంద్రాలు, కియోస్కుల్లో పశు దాణా తదితర ఉత్పత్తులన్నీ అందుబాటులో ఉంచాలి.
ఆగస్టులో విశాఖ, అనంతలకూ అమూల్..
ప్రకాశం, కడప, చిత్తూరు, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో పాల వెల్లువ ప్రారంభమైందని అధికారులు సీఎంకు చెప్పారు. ఆగస్టులో ఏపీ అమూల్‌ను విశాఖ, అనంతపురం జిల్లాలకు విస్తరిస్తున్నామన్నారు. అయిదు ఫిషింగ్ హార్బర్లు, ఒక ఫిష్‌ల్యాండ్ సెంటర్ పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు. మిగిలినచోట్ల కూడా పనులు ప్రారంభిస్తామన్నారు. రాష్ట్రంలో ఏటా 4.36 లక్షల మెట్రిక్ టన్నుల ఆక్వా ఉత్పత్తులను వినియోగిస్తున్నారన్న అధికారులు.. దాన్ని 12 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచాలనుకుంటున్నామని వివరించారు.
ఇదీ చదవండి: ADIMULAPU SURESH: 'విద్యా సిబ్బందికి వెంటనే వ్యాక్సినేషన్ పూర్తి చేయండి'