వరంగల్ పర్యటన అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (Cm Kcr) యాదాద్రి (Yadadri) క్షేత్రాన్ని సందర్శించారు. వరంగల్ నుంచి హెలికాప్టర్ ద్వారా సాయంత్రం 6:18 నిమిషాలకు ఆలయ నగరికి చేరుకున్న ఆయన... తొలుత గండిచెరువు ప్రాంగణం వద్ద వలయ రహదారిలో నిర్మాణాలు పరిశీలించారు.
కల్యాణకట్ట, పుష్కరిణి, దీక్షాపరుల మండపం తదితర కట్టడాల గురించి వివరాలు తెలుసుకున్నారు. కొండ చుట్టూ గల వలయ రహదారిని... సాంతం వీక్షించారు.
రేపు వాసాలమర్రికి...
యాదాద్రి (Yadadri) పర్యటన అనంతరం సీఎం కేసీఆర్ (Cm Kcr) రేపు ఇదే జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో పర్యటించనున్నారు. ఇందుకు గాను సీఎంవో ఓఎస్డీ ప్రియాంక వర్గీస్... వాసాలమర్రిలో ఏర్పాట్లను పరిశీలించారు. ప్రభుత్వ విప్, స్థానిక శాసనసభ్యురాలు గొంగిడి సునీత, కలెక్టర్ పమేలా సత్పతితోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు.
సభాస్థలి, భోజనశాల ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. గ్రామ సభ విజయవంతానికి పూర్తిస్థాయిలో కార్యాచరణ ఉండేందుకు గాను... సమీక్ష నిర్వహించారు. గ్రామసభలో ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు... ఇతర గ్రామాల వారు రాకూడదని ఆదేశాలు జారీ చేశారు. సీఎం గ్రామ పర్యటనకు మరొక్క రోజు మాత్రమే మిగిలి ఉండటంతో... వాసాలమర్రిలో శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సహపంక్తి భోజనాలు ఒకచోట, సభ మరోచోట నిర్వహించేలా పనులు సాగుతున్నాయి. ఇంటింటికి తిరిగి గ్రామస్థులకు అధికారులు పాసులు అందజేస్తున్నారు.
ఇదీ చూడండి: ysr cheyutha: రేపు వైఎస్సార్ చేయూత నిధులు విడుదల