తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. సంస్థను యథావిధిగా నడపడం సాధ్యం కాదని ఆ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో ఆర్టీసీపై ఉన్నత స్థాయిలో చర్చ జరిగింది. ఈ సమావేశంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, సీనియర్ అధికారులు నర్సింగ్ రావు, సునిల్ శర్మ, రామకృష్ణ రావు, సందీప్ సుల్తానియా, న్యాయశాఖ కార్యదర్శి సంతోష్ రెడ్డి, ఎజి ప్రసాద్,అడిషనల్ ఎజి రాంచందర్ రావు, ఆర్టీసీ ఇడిలు వెంకటేశ్వరరావు, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. కార్మికులను బేషరతుగా విధుల్లోకి తీసుకోవాలన్న కార్మిక సంఘాల ఐకాస డిమాండ్ పై విస్తృతంగా చర్చించారు.
కోర్టు తీర్పు తర్వాతే
రూట్ల ప్రైవేటీకరణపై శుక్రవారం కోర్టు తీర్పు తర్వాత తుది నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వ నిర్ణయించింది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే అంశంపై ప్రభుత్వం విస్తృత చర్చ జరిపింది. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి, నిర్ణయాలు, కోర్టులో ఇంకా నడుస్తున్న కేసులు తదితర అంశాలపై కూలంకశంగా అధ్యయనం చేయాలని నిర్ణయించింది.
ఇదీ చదవండి: