cm jagan tour: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు, రేపు వరద ప్రభావిత జిల్లాలైన కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో పర్యటించనున్నారు. భారీ వర్షాలకు దెబ్బతిన్న జిల్లాల్లో రెండు రోజులపాటు పర్యటిస్తారు. నేటి ఉదయం 9.30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి కడప జిల్లాకు సీఎం వైఎస్ జగన్ బయలుదేరతారు. ఉదయం 10.50 గంటలకు కడప జిల్లా మందపల్లి (రాజంపేట) చేరుకుంటారు. అక్కడ నుంచి పుల్లపొత్తూరు గ్రామానికి వెళ్తారు.
పుల్లపొత్తూరు గ్రామంలో పర్యటించి వరదకు దెబ్బతిన్న ప్రాంతాలను స్వయంగా పరిశీలిస్తారు. సహాయ శిబిరంలో ఉన్న బాధితులతో సీఎం ముఖాముఖి నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు పుల్లపొత్తూరు గ్రామ సచివాలయానికి చేరుకోనున్న సీఎం.. అక్కడ నుంచి ఎగుమందపల్లి వెళ్లి గ్రామంలో వరద ప్రభావానికి దెబ్బతిన్న ప్రాంతాల్లో కాలినడకన పర్యటిస్తారు.
వరద నష్టంపై అధికారులతో సమీక్ష..
ఎగుమందపల్లి నుంచి నేరుగా అన్నమయ్య డ్యామ్ పరిశీలిస్తారు. దెబ్బతిన్న ప్రాజెక్టుపై ఆరా తీస్తారు. వరద ప్రభావంతో ప్రాజెక్టుకు జరిగిన నష్టంపై సీఎంకు అధికారులు వివరాలు అందిస్తారు. మధ్యాహ్నం 2.15 గంటలకు మందపల్లి చేరుకుని వరద నష్టం, అనంతరం సహాయక చర్యలపై జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులతో సీఎం సమీక్ష నిర్వహిస్తారు.
వరద నష్టాన్ని స్వయంగా పరిశీలించనున్న సీఎం...
మధ్యాహ్నం 3.05 గంటలకు చిత్తూరు జిల్లా రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడ నుంచి రేణిగుంట మండలం వేదలచెరువు, ఎస్టీ (యానాది) కాలనీకి చేరుకుని.. కాలనీ ప్రజలతో వరదనష్టంపై ఆరా తీస్తారు. 4.30 గంటలకు ఏర్పేడు మండలం పాపనాయుడు పేట గ్రామానికి చేరుకోనున్న ముఖ్యమంత్రి.. వరద నష్టాన్ని స్వయంగా పరిశీలిస్తారు. అక్కడ నుంచి తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు, పాడిపేట క్రాస్‌కు వెళ్తారు. వరద నష్టంపై బాధితులతో మాట్లాడనున్నారు. అనంతరం తిరుపతిలోని పద్మావతి అతిథి గృహానికి చేరుకుంటారు.
సాయంత్రం 6 గంటలకు వరద నష్టం, సహాయ, పునరావాసంపై.. అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమీక్ష నిర్వహిస్తారు. రాత్రి పద్మావతి అతిధి గృహంలోనే సీఎం బసచేయనున్నారు.
శుక్రవారం పర్యటన ఇలా..
శుక్రవారం చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం వైఎస్ జగన్ పర్యటించనున్నారు. ఉదయం తిరుపతి, కృష్ణానగర్‌లో పర్యటించి, వరద నష్టాన్ని పరిశీలించడంతో పాటు స్ధానికులతో వరద సమస్యలపై మాట్లాడతారు. అక్కడ నుంచి ఆటోనగర్‌లో పర్యటించనున్నారు. అనంతరం ఉదయం 11 గంటలకు నెల్లూరు జిల్లా బయలుదేరి వెళ్లనున్నారు.
ఇసుక మేటలు వేసిన వరి పొలాలను పరిశీలించనున్న సీఎం జగన్..
నెల్లూరు రూరల్ దేవరపాలెంలో భారీ వర్షాలకు దెబ్బతిన్న ఆర్‌అండ్‌బీ రోడ్డును, వ్యవసాయ పంటలను పరిశీలించనున్నారు. ఆ తర్వాత కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ గ్రామానికి వెళ్లనున్న సీఎం వైఎస్ జగన్.. పెన్నానది వరద ప్రభావంతో దెబ్బతిన్న ప్రాంతాలను, వ్యవసాయ పంటలను పరిశీలించనున్నారు. అక్కడ నుంచి పెనుబల్లి జొన్నవాడ చేరుకుని, వరద ధాటికి కొట్టుకుపోయిన ఆర్‌అండ్‌బీ రహదారిని, పంచాయతీరాజ్ రోడ్లతో పాటు ఇసుక మేటలు వేసిన వరిపొలాలను స్వయంగా పరిశీలించనున్నారు.
రైతులతో సీఎం ముఖాముఖి..
భారీ వర్షాలకు పంటలు, పశువులు నష్టపోయిన రైతులతో సీఎం ముఖాముఖి నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1.15 గంటలకు నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని భగత్ సింగ్ కాలనీకి చేరుకోనున్న సీఎం.. వరద ప్రభావంతో నష్టపోయిన బాధిత కుటుంబాలను పరామర్శిస్తారు. అక్కడి నుంచి దర్గామిట్ట, జిల్లా పరిషత్ హైస్కూల్ చేరుకుని వరద నష్టంపై అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీని పరిశీలిస్తారు.
జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులతో వరద నష్టంపై సమీక్షించిన అనంతరం సీఎం సాయంత్రం 3.20 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. సాయంత్రం 4.20 గంటలకు రేణిగుంట నుంచి గన్నవరం చేరుకుని, అక్కడ నుంచి తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వెళ్లనున్నారు.
ఇదీ చదవండి: పట్టువీడని విపక్షాలు- ఉభయసభలు రేపటికి వాయిదా