హెల్త్ హబ్స్ ఆస్పత్రుల్లో 50 శాతం బెడ్లు ఆరోగ్యశ్రీ రోగులకు ఇవ్వాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. బీమా కంపెనీలతో పోలిస్తే ఆరోగ్యశ్రీ చెల్లింపు ఛార్జీలే మెరుగ్గా ఉన్నాయన్నారు. ఆరోగ్యశ్రీకి ఎక్కువ బెడ్లు ఇచ్చిన వారికే హెల్త్ హబ్స్‌లో ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైద్యారోగ్య శాఖపై సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. కొవిడ్ పరిస్థితి, వ్యాక్సినేషన్, హెల్త్ హబ్స్, ఆస్పత్రుల నిర్వహణ, కుటుంబ వైద్యుడి విధానంపై సీఎం సమీక్షించారు.
లాభాపేక్షలేకుండా..
హెల్త్‌హబ్స్ ద్వారా వచ్చే ఆస్పత్రుల బోర్డుల్లో ఒక సభ్యుడు ప్రభుత్వం నుంచి ఉంటారని సీఎం జగన్ తెలిపారు. రాష్ట్రానికి చెందిన డాక్టర్లు ఇక్కడే స్థిరపడి మంచి వైద్య సేవలు అందించే ఉద్దేశం కూడా హెల్త్‌హబ్స్ ద్వారా నెరవేరుతుందన్నారు. డాక్టర్లు నిరంతరం అందుబాటులో ఉండాలన్నది ఆస్పత్రుల ఎంపికకు ఒక ప్రమాణం కావాలన్నారు. అవయవ మార్పిడి చికిత్సలు చేసే ఆస్పత్రుల ఏర్పాటుపై హెల్త్ హబ్స్‌లో ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. వైద్యం కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లే అవసరం ఇక ఉండకూడదని స్పష్టం చేశారు. లాభాపేక్షలేకుండా ఆస్పత్రులు నిర్వహిస్తున్న సంస్థలకూ ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం అన్నారు.
నిర్వహణపై దృష్టి..
ఆస్పత్రుల నిర్వహణపైనా సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. సీహెచ్‌సీల నుంచి బోధనాసుపత్రుల వరకూ నిర్వహణ కోసం అధికారుల నియామకానికి సీఎం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఉత్తమ నిర్వహణ పద్ధతులకు అనుగుణంగా కొత్తగా నిర్మిస్తున్న ఆస్పత్రులు, బోధనాసుపత్రుల నిర్మాణాలు ఉండాలని సీఎం ఆదేశించారు. వీటి డిజైన్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఆస్పత్రుల్లో బెడ్ల నిర్వహణ, బాత్రూమ్‌ల నిర్వహణ, పరిశుభ్రత, ఆహారంలో నాణ్యత చాలా ముఖ్యమన్నారు.
ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లేలా..
రిసెప్షన్ సేవలు కూడా కీలకమని సీఎం అన్నారు. సరిపడా వైద్యులు, పైన పేర్కొన్న సేవలు నాణ్యతతో అందితే కార్పొరేట్ ఆస్పత్రుల స్థాయిలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా సేవలు అందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అత్యుత్తమ నిర్వహణా పద్ధతులను ప్రభుత్వ ఆస్పత్రుల్లో పెట్టాలని సీఎం సూచించారు. ఎవరి ఆరోగ్యం బాగోలేకపోయినా అందరూ కూడా ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లే పరిస్థితి ఉండాలని స్పష్టం చేశారు. ఆస్పత్రుల నిర్వహణలో పర్యవేక్షణస్థాయి బలోపేతంగా ఉండాలన్నారు. సిబ్బంది సెలవులో ఉంటే.. సేవలకు అంతరాయం రాకూడదన్నారు. నిర్ణీత రోజులకు మించి సెలవులో ఉంటే.. వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు.
రాష్ట్రంలోని ప్రతి గ్రామ సచివాలయంలో కనీసం నెలకు రెండు సార్లు 104 ద్వారా వైద్యుల సేవలు ఉండేలా విధివిధానాలు రూపొందించండి. జనాభాను దృష్టిలో ఉంచుకొని ఆ మేరకు 104 సేవలను వినియోగించాలి. విలేజ్ క్లినిక్స్ విధివిధానాలు, ఎస్‌ఓపీలను ఖరారు చేయాలి. పీహెచ్‌సీల్లో కనీసం ఇద్దరు వైద్యులు అందుబాటులో ఉండాలి. వారిలో ఒకరు పీహెచ్‌సీలో సేవలు అందిస్తే.. మరొకరు 104 ద్వారా ఫ్యామిలీ డాక్టర్ విధానంలో సేవలు అందించేలా చూడాలి. కొత్త పీహెచ్‌సీల నిర్మాణాలు కూడా వీలైనంత త్వరగా పూర్తిచేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలి’’ అని సీఎం జగన్ తెలిపారు.
కొవిడ్-19 నివారణ, నియంత్రణ చర్యలతో పాటు వ్యాక్సినేషన్‌పై తీసుకుంటున్న చర్యలను సీఎంకు అధికారులు వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 14,652 యాక్టివ్ కేసులున్నట్లు తెలిపారు. పాజిటివిటీ రేటు 2.23 శాతంగా ఉందని, రికవరీ రేటు 98.60 శాతంగా ఉందన్నారు. 50 అంతకంటే ఎక్కువ బెడ్స్ ఉన్న 140 ఆస్పత్రుల్లో ఆక్సిజన్ జనరేషన్ (పీఎస్‌ఏ) ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని సీఎంకు తెలిపారు. అక్టోబరు 11 నాటికి 140 ఆస్పత్రుల్లో పీఎస్‌ఏ ప్లాంట్లు అందుబాటులోకి రానున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఇదీ చదవండి: