గ్రామం యూనిట్‌గా వ్యాక్సినేషన్ నిర్వహించాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. దీనివల్ల వ్యాక్సిన్లు వృథా కాకుండా మరింత సమర్థవంతంగా అందించవచ్చన్నారు. కొవిడ్ నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం.. ఎక్కువగా ప్రజా బాహుళ్యంలో ఉన్నవారు, ఉద్యోగులు, సిబ్బందికి వ్యాక్సినేషన్‌లో అధిక ప్రాధాన్యతనివ్వాలన్నారు. వ్యాక్సిన్లు, అనంతర పరిస్థితులపై శాస్త్రీయంగా విశ్లేషణ చేయాలన్నారు. రాష్ట్రంలో కొవిడ్ కేసులు గణనీయంగా తగ్గుతున్నాయని అధికారులు సీఎంకు వివరించారు. పాజిటివిటీ రేటు 2.29 శాతంగా ఉందన్నారు. మూడో వేవ్ వస్తుందన్న హెచ్చరికల నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. సెప్టెంబరు 10 నాటికి 50 పడకలు దాటిన అన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆక్సిజన్ పైప్‌లైన్లు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు వివరించారు. 140 చోట్ల ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు కానున్నట్లు తెలిపారు. ఆగస్టు నెలాఖరు నాటికి 104 పీఎస్ఏ ప్లాంట్లు ఏర్పాటవుతాయన్నారు.
డేటా నిక్షిప్తం చేయండి..
ఆరోగ్యశ్రీ కార్డులో కుటుంబ సభ్యుల ఆరోగ్య వివరాల డేటాను నిక్షిప్తం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ఏపీ డిజిటల్ హెల్త్ పైనా సమీక్షించిన సీఎం...క్యూఆర్ కోడ్ రూపంలో ఈ వివరాలు తెలుసుకునేలా ఉండాలన్నారు. విలేజ్ క్లినిక్స్‌లోనూ డేటా నమోదు చేయాలని సూచించారు. గ్రామాలకు 104 వాహనం వెళ్లే సరికి, ఒక వ్యక్తి ఆరోగ్య వివరాలు డాక్టర్‌కు సులభంగా తెలిసేలా ఈ విధానం ఉండాలన్నారు. దీనివల్ల చికిత్స చాలా సులభతరమవుతుందని, వైద్యం త్వరగా అందుతుందని సీఎం తెలిపారు. విలేజ్ క్లినిక్స్‌లో సాధారణ పరీక్షలు చేసే పరిస్థితి ఉండాలని..ఆ మేరకు మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. విలేజ్ క్లినిక్స్‌లో పనిచేస్తున్న సిబ్బందికి..ఆరోగ్యశ్రీ కింద ఉన్న ఆస్పత్రుల వివరాలు అందుబాటులో ఉంచాలన్నారు. చికిత్స కోసం రోగులను నేరుగా సంబంధిత ఆస్పత్రిలో చేర్చడంతోపాటు వారితో సమన్వయం చేసుకోవడం వంటి బాధ్యతలు సిబ్బంది నెరవేర్చేలా విధానం ఉండాలన్నారు. భవిష్యత్తులో కుటుంబానికి కాకుండా విడివిడిగా వ్యక్తుల పేరు మీద ఆరోగ్యశ్రీ కార్డులు ఇచ్చే ఆలోచన చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఆరోగ్యశ్రీ కార్డు నెంబర్ చెప్పినా లేదా ఆధార్ కార్డు నెంబర్ చెప్పినా వెంటనే సంబంధిత వ్యక్తి ఆరోగ్య వివరాలు లభ్యమయ్యే విధానం అందుబాటులోకి తేవాలన్నారు.
పిల్లలకు వ్యాక్సిన్‌పై ప్రత్యేక దృష్టి..
పిల్లలకు వ్యాక్సిన్లపైనా ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. పిల్లలకు అందించే వాక్సిన్ల వివరాలను ఆరోగ్యశ్రీ కార్డుల్లో నమోదు చేయాలన్నారు. గ్రామాల్లో కాలుష్యంపైనా దృష్టి సారించాలన్నారు. విలేజ్ క్లినిక్స్ నుంచి టీచింగ్ ఆస్పత్రులు వరకూ అదనంగా ఎంతమంది సిబ్బంది కావాలో డేటా తయారుచేయాలని, అవసరమైన సంఖ్యలో వైద్యులను నియమించాలన్నారు. జిల్లాను యూనిట్‌గా తీసుకుని నియామకాలు చేయాలన్నారు. మూడు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి కావాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో పనిచేసే వైద్యులు, సిబ్బందికి ప్రోత్సాహకాలు ఇచ్చే అంశం పరిశీలించాలన్నారు.
ఇదీ చదవండి: కొవాగ్జిన్, కొవిషీల్డ్ డోసుల మిక్సింగ్‌పై ప్రయోగాలు