రాష్ట్ర వ్యవసాయ మిషన్ పై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన భేటీకి ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రులు కన్నబాబు, మోపిదేవి, బాలినేని, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ అగ్రికల్చర్ మిషన్ వెబ్‌సైట్‌ను సీఎం ప్రారంభించారు. రైతు భరోసా పథకంపై తొలుత సమీక్షించారు. ఇప్పటి వరకూ 45, 20, 616 మంది కుటుంబాలకు రైతు భరోసా కింద లబ్ధి చేకూర్చినట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. డిసెంబర్ 15 వరకూ కౌలు రైతులకు ఈ పథకంలో లబ్ధిదారులుగా అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
వర్క్‌షాపుల ఏర్పాటుపై సమీక్ష
గ్రామ సచివాలయాల పక్కన దుకాణాలు, వర్క్‌షాపుల ఏర్పాటుపైనా సీఎం సమీక్షించారు. జనవరి 1 నుంచి ప్రతి గ్రామంలో ఈ విధానాన్ని అమల్లోకి తీసుకు రావాలని సీఎం ఆదేశించారు. రైతుల కోసం ఏర్పాటు చేసే దుకాణాల్లో దొరికే ప్రతి వస్తువుకూ ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుందని సీఎం చెప్పారు. వర్క్‌షాపులో రైతులకు ఏయే అంశాలకు శిక్షణ ఇవ్వాలన్న దానిపై ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. భూసార పరీక్షలు వర్క్‌షాపులోనే నిర్వహించాలని.. నేచురల్ ఫార్మింగ్‌పై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. బయో పెస్టిసైడ్స్, బయో ఫెర్టిలైజర్స్ పేరిట జరుగుతున్న మోసాలను అరికట్టడానికి ఏపీ బయో ప్రోడక్ట్స్ రెగ్యులేటరీ యాక్ట్ తీసుకురావాలని సీఎం నిర్ణయించారు.
కనీస మద్దతు ధర లేని చిరు ధాన్యాలను సాగుచేస్తున్న రైతులను ఆదుకోవాలని సీఎం నిర్ణయించారు. సాగుకు అవుతున్న ఖర్చును పరిగణనలోకి తీసుకుని ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వమే ధరలు ప్రకటించాలని సూచించారు. దీనిపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించారు.
ఇదీ చదవండి: