రాష్ట్రంలో జూన్ 20 తర్వాత కర్ఫ్యూలో కొన్ని సడలింపులుంటాయని సీఎం జగన్ వెల్లడించారు. సడలింపులు ఇస్తూనే కర్ఫ్యూ కొనసాగించాల్సి ఉంటుందని తెలిపారు. కొవిడ్ కేసులు సున్నా స్థాయికి చేరతాయని ఎప్పటికీ భావించొద్దని, జాగ్రత్తలు తీసుకుంటూనే వైరస్‌ను ఎదుర్కోవాలన్న విషయాన్ని మర్చిపోవద్దని పేర్కొన్నారు. కొవిడ్ ప్రొటోకాల్‌ను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. స్పందన కార్యక్రమంపై బుధవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో సమీక్షించి మాట్లాడారు. 'కరోనా మూడో దశ వస్తుందో.. లేదో మనకు తెలియదు. అది వచ్చినప్పుడు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. మూడో దశలో పిల్లలు ఎక్కువ ప్రభావితమవుతారని చెబుతున్నారు. వీటిని దృష్టిలో ఉంచుకుని చక్కటి ప్రణాళికతో సిద్ధంగా ఉండాలి. జిల్లా స్థాయిలో వచ్చే 2 నెలలకు తగినట్లు కార్యాచరణ సిద్ధం చేసి అమలు చేయాలి' అని సూచించారు.
చిన్నారుల వైద్యానికి నర్సులకు శిక్షణ
‘రెండు నెలల ప్రణాళికలో భాగంగా కలెక్టర్లు బోధనాసుపత్రుల్లో ఐసీయూ పడకల నాణ్యత పరిశీలించాలి. చిన్నారులకు వైద్యం అందించే సదుపాయాల్లో నాణ్యత ఉందో.. లేదో చూడాలి. సీహెచ్‌సీ, ప్రాంతీయాసుపత్రుల్లో ఆక్సిజన్ పడకలు, అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకోవాలి. జిల్లాలో చిన్న పిల్లల వైద్యులు ఎక్కడ ఎంత మంది ఉన్నారో మ్యాపింగ్ చేయాలి. అవసరమైన సమయంలో వారి సేవలను ప్రభుత్వం వినియోగించుకునేలా ఉండాలి. ప్రభుత్వాసుపత్రుల్లో నియామకాలు చేపడుతూనే మ్యాపింగ్ చేయాలి.
చిన్నారులకు వైద్యం అందించడంలో ఎలా వ్యవహరించాలో నర్సులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. పిల్లల వైద్యం కోసం కృష్ణా-గుంటూరు ప్రాంతం, విశాఖ, తిరుపతిలో 3 అత్యాధునిక ఆసుపత్రులు ఏర్పాటు చేస్తున్నాం. వీటికి అవసరమైన భూములను గుర్తించాలి’ అని ఆదేశించారు.
కర్ఫ్యూతో మంచి ఫలితాలు
‘మే 5 నుంచి విధించిన కర్ఫ్యూ, అనుసరించిన వ్యూహ మంచి ఫలితాలను ఇచ్చింది. ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయకుండా.. సమాజంలోని ఏ వర్గాన్ని కష్టపెట్టకుండా చేయగలిగాం. పాజిటివ్ కేసుల సంఖ్య, పాజిటివిటీ రేటు తగ్గుతోంది. పాజిటివిటీ రేటు మే 15న 25.56 శాతానికిపైగా ఉంటే.. ప్రస్తుతం 5.97 శాతంగా ఉంది. వచ్చే వారంలో కేసులు ఇంకా తగ్గుతాయి. ఇక ఈ స్థాయిలో పరీక్షల అవసరం ఉండకపోవచ్చు. అయినప్పటికీ అన్నీ ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేస్తే మంచి ఫలితాలుంటాయి’ అని సూచించారు.
సమావేశంలో సీఎం ఆదేశాలు,సూచనలు ఆయన మాటల్లో..
* దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగా ప్రైవేటు సెక్టారులో సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల ఏర్పాటుకు ఆహ్వానం పలుకుతున్నాం. జిల్లా కేంద్రం, కార్పొరేషన్లలో 16 ప్రైవేటు ఆసుపత్రులు ఏర్పాటు చేయించేందుకు ప్రోత్సాహకంగా భూములివ్వాలని నిర్ణయించాం. యాజమాన్యం మూడేళ్ల కాలంలో ఆసుపత్రి రూపేణా రూ.100 కోట్ల పెట్టుబడి పెట్టాలి. ఒకేచోట కాకుండా నగరాలు, పట్టణాలకు నలువైపులా ఈ ఆసుపత్రులు వచ్చేలా చూడాలి. వీటిని ఆరోగ్యశ్రీతో అనుసంధానిస్తాం. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు రూపొందిస్తున్నాం.
* ప్రైవేటు ఆసుపత్రులు ప్రభుత్వం ప్రకటించిన ధరల కన్నా ఎక్కువ వసూలు చేయకూడదు. అలా చేసిన వాటిని మూసేయడానికి కలెక్టర్లు సంకోచించొద్దు. మొదటి సారి ఉల్లంఘిస్తే జరిమానా, రెండోసారి చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయాలి.
* నిర్దేశిత విధానాల ప్రకారం వ్యాక్సినేషన్ జరగాలి. రాష్ట్రంలో మూడున్నర కోట్ల మందికి వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంటే.. 26.33 లక్షల మందికే రెండు డోసులు ఇవ్వగలిగాం. వ్యాక్సినేషన్ సామర్థ్యం పెరగాల్సిందే.
కస్టమ్ హైరింగ్ కేంద్రాలతో పెను మార్పులు
* కస్టమ్ హైరింగ్ కేంద్రాలు, హబ్‌లు వ్యవసాయ రంగంలో పెను మార్పులకు దారి తీస్తాయి. స్థానిక రైతులకు అందుబాటు ధరల్లో యంత్రాల సేవలు అందిస్తాయి. జులై 8న మొదటి విడతగా 3 వేల ఆర్బీకేల పరిధిలో ఈ కేంద్రాలు ప్రారంభిస్తున్నాం. అక్టోబరులో రెండో విడత, జనవరిలో మూడో విడత ప్రారంభిస్తున్నాం.
* ప్రతి గ్రామంలో డిజిటల్ గ్రంథాలయాలు తీసుకొస్తున్నాం. డిసెంబరులోగా 2,824 గ్రామ పంచాయతీలకు ఫైబర్ గ్రిడ్ చేరుతుంది. అక్కడ భూములను గుర్తించి గ్రంథాలయాల నిర్మాణంపై దృష్టి పెట్టాలి.
అలా జరగకపోతే కలెక్టర్ విఫలమైనట్లే..
* ఈ-క్రాప్ జరగకపోతే కలెక్టర్ విఫలమైనట్లు భావించవచ్చు. కనీసం 10 శాతం ఈ-క్రాప్‌ను కలెక్టర్లు, జేసీలు పరిశీలించాలి. దీనిపై జూన్ 3 నుంచి 8 వరకు ఆర్బీకేల స్థాయిలో శిక్షణ నిర్వహిస్తాం.
* ప్రతి రైతుకు రశీదు ఇవ్వాలి. ఈ-క్రాప్ వివరాలన్నీ ఇందులో ఉండాలి. వీటి ఆధారంగానే ఇన్‌పుట్ సబ్సిడీ, బీమా పరిహారం వస్తుంది. వివాదాస్పద భూమి అయినా ఈ-క్రాప్‌లో నమోదు చేయాలి. ఉద్యాన పంటలకు సీజన్‌తో సంబంధం లేకుండా నమోదు చేయాలి.
* డీలర్లు అమ్మే విత్తనాల నాణ్యత కచ్చితంగా పరిశీలిస్తే బ్లాక్ మార్కెటింగ్, కల్తీలకుఅడ్డుకట్ట వేయగలుగుతాం.
* గ్రామ సచివాలయాలు, ఆర్బీకే, ఆరోగ్య కేంద్రాల పనుల్ని ఒక గ్రామంలో ఒకరికే అప్పగించొద్దు.
* న్యాయస్థానాల్లో కేసుల కారణంగా 3,70,201 మందికి ఇళ్ల స్థలాలు అందలేదు. పేదలకు ఇంటి పట్టాలు రాకూడదని తెదేపా లాంటి ప్రతిపక్షాలు కేసులు వేసి అడ్డుకుంటున్నాయి. హైకోర్టుకు సెలవులు ముగిసినందున ఇలాంటి కేసులపై దృష్టిపెట్టండి.
* ఇసుక రీచ్‌లు 40 కిలోమీటర్ల లోపల ఉంటే ఇళ్ల స్థలాల లేఅవుట్ల వద్దే ఇసుక ఇవ్వండి. 40 కిలోమీటర్ల కన్నా దూరం ఉంటే జేపీ వెంచర్స్ లిమిటెడ్ ద్వారా లేఅవుట్లకు ఇసుకను చేరవేయాలి.
ఇదీ చదవండి:
cross firing: విశాఖ జిల్లాలో ఎదురుకాల్పులు.. ఆరుగురు మావోయిస్టులు మృతి