కరోనా వ్యాప్తి నివారణ చర్యలపై సీఎం జగన్.. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ చేశారు. ఆయా జిల్లాలోని కరోనా కేసులు, నిరోధక చర్యలపై ఆరా తీశారు. 14 రోజుల పరిశీలన పూర్తైన వారిని ఇంకా క్వారంటైన్‌లో ఉంచుతున్నారన్న సీఎం... వైద్యవిధాన ప్రక్రియ పూర్తి చేసి వారిని ఇళ్లకు పంపించాలని సూచించారు. ఒకటికి రెండు సార్లు పరీక్షలు చేసి నెగిటివ్ వస్తే పంపించేయాలని కోరారు. ఇళ్లకు వెళ్లేవారికి పౌష్టిక ఆహారం తీసుకునేలా సలహాలు, సూచనలు ఇవ్వాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు.
బాధితులకు ఉత్తమ వైద్యం అందించాలి : సీఎం
కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నవారందరికీ పరీక్షలు చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. వ్యాధి లక్షణాలు ఉన్నవారికి అత్యుత్తమ వైద్యం అందించాలన్నారు. హైరిస్క్ కేసులను గుర్తించి పూర్తిస్థాయిలో వైద్యం అందించాలని చెప్పారు. క్రిటికల్ కేర్ ఆస్పత్రులకు తరలించి వైద్యం అందిస్తే మరణాలు అరికట్టగలమని అభిప్రాయపడ్డారు. క్వారంటైన్ సెంటర్లలో మంచి సదుపాయాలు కల్పించాలని అధికారులకు సీఎం సూచించారు. ప్రతి ఆస్పత్రిలో ఐసోలేషన్ సదుపాయం ఉండాలన్న సీఎం జగన్.. వైద్య సిబ్బందికి మాస్క్‌లు, పీపీఈలు అందుబాటులో ఉంచాలని ఆదేశాలిచ్చారు.
'ఏప్రిల్ 16 నుంచి రెండో విడత రేషన్'
ఏప్రిల్ 16 నుంచి రేషన్ పంపిణీ చేపట్టాలని వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లను సీఎం జగన్ ఆదేశించారు. రేషన్ దుకాణాల కౌంటర్లను పెంచాలన్నారు. అర్హత ఉన్నవారు వస్తే వారికి కార్డు ఇవ్వాలని సీఎం అధికారులకు ఆదేశాలిచ్చారు. ఆహారంలేని పరిస్థితి ఉండకూడదన్న సీఎం... ఎవరు రేషన్ అడిగినా ఇవ్వాలన్నారు.
'తెలంగాణ ధాన్యం రాకుండా చర్యలు'
ధాన్యం కొనుగోళ్లు గ్రామస్థాయిలో చేస్తున్నామన్న సీఎం జగన్... తెలంగాణ నుంచి ధాన్యం కూడా రాష్ట్రంలోకి రాకుండా నిలిపేశామన్నారు. మద్దతు ధరకన్నా తక్కువకు కొనుగోలు చేసే పరిస్థితి ఉండకూడదన్నారు. సరిహద్దుల నుంచి ధాన్యం రాష్ట్రంలోకి రాకుండా చూడాలని కలెక్టర్లకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. కొనుగోళ్లు సవ్యంగా జరుగుతున్నాయా అన్నది కలెక్టర్లు చూసుకోవాలన్నారు. ఏ సమస్య ఉన్నా వెంటనే సీఎం కార్యాలయం దృష్టికి తీసుకురావాలని చెప్పారు.
ఇదీ చదవండి: