వినాయక చవితి ఉత్సవాలను ఇళ్లకే పరిమితం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ప్రజారోగ్యం దృష్ట్యా ఈ జాగ్రత్తలు తప్పవని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోని ఖాళీలను గుర్తించి.. 90 రోజుల్లో నియామకాలను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక.. ఎక్కడా వైద్యులు, సిబ్బంది లేరనే మాటలు వినిపించకూడదు. డిప్యుటేషన్ అనే పదాలూ రాకూడదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితులపై క్యాంపు కార్యాలయంలో సీఎం గురువారం సమీక్షించారు.
‘బయోమెట్రిక్‌తో పక్కాగా హాజరు తీసుకోవాలి. పని తీరుపైనా పర్యవేక్షణ ఉండాలి. ప్రజలకు వైద్య సేవలందించడంలో ఎలాంటి ఇబ్బందులు రాకూడదు. ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థ ద్వారానే సమర్థంగా సేవలు అందించాలి. డబ్ల్యూహెచ్‌వో, జీఎంపీ ప్రమాణాలున్న మందులే ఇవ్వాలి. దీనికి అనుగుణంగా నిరంతర తనిఖీలను నిర్వహించాలి’ అని సూచించారు. ‘రాష్ట్రంలో రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగించాలి. కొవిడ్ పరిస్థితుల దృష్ట్యా పండగల సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వినాయక విగ్రహాలను ఇళ్లలో పెట్టుకునేందుకే అనుమతులివ్వాలి. బహిరంగ స్థలాల్లో విగ్రహాలు వద్దు. నిమజ్జన ఊరేగింపులూ వద్దు’ అని వైద్యాధికారులు చేసిన సిఫారసుపై సీఎం సమీక్షించారు. ఈ మేరకు మార్గదర్శకాలు జారీ చేయాలని ఆదేశించారు.
మూడో ఉద్ధృతిపై అప్రమత్తం: టీకా తీసుకున్న తర్వాత కొవిడ్ సోకిన వ్యక్తుల్లో ఎలాంటి ప్రభావాలున్నాయో అధ్యయనం చేయాలని సీఎం అధికారులకు సూచించారు. బూస్టర్ డోస్ తీసుకోవాలంటూ సమాచారం వస్తున్న నేపథ్యంలో.. ఎలాంటి వ్యూహాలు అనుసరించాలనే అంశంపైనా ఆలోచించాలన్నారు. కొవిడ్ మూడో దశను దృష్టిలో ఉంచుకుని వైద్య సేవలు అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు వివరించారు. ‘20,964 ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు ఇప్పటికే సిద్ధం చేశాం. మరో 2,493 సమకూర్చుకుంటున్నాం. 27,311 ఆక్సిజన్ డీ-టైప్ సిలిండర్లను సిద్ధం చేశాం. ఇప్పటికే 50 ఆసుపత్రుల్లో ఆక్సిజన్ పైపులైన్ల పనులు పూర్తయ్యాయి. సెప్టెంబరు నెలాఖరు నాటికి మరో 95 ఆసుపత్రుల్లో పూర్తి చేస్తాం. రాష్ట్రంలో ఇప్పటి వరకు 3,02,52,905 టీకా డోసులు వేశాం. మొత్తం 2.18 కోట్ల మందికి టీకా వేశాం. ఇందులో ఒక డోస్ 1.34 కోట్ల మందికి, రెండు డోసులు 84.48 లక్షల మందికి పూర్తయ్యాయి. 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి నవంబరు నెలాఖరుకల్లా ఒక డోస్ టీకా ఇస్తాం. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి 18 ఏళ్లు నిండిన వారందరికీ టీకా ప్రక్రియ పూర్తవుతుంది’ అని అధికారులు సీఎంకి వివరించారు.
ఇదీ చదవండి: