రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణ, పరిపాలన వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణల ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు సీఎం జగన్ తెలిపారు. దీని కోసం రాజధాని కార్యకలాపాలను మూడు ప్రాంతాలకు వికేంద్రీకరించామని... కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలు, శాసన రాజధానిగా అమరావతిని ప్రణాళిక వేసుకున్నామని వెల్లడించారు. ఈ ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని తెలిపారు. శుక్రవారం రాత్రి దిల్లీలో అమిత్‌షాను కలిసిన ఆయన... మూడు రాజధానుల నిర్ణయాన్ని వివరించారు. మూడు రాజధానుల కోసం ఉద్దేశించిన ఆంధ్రప్రదేశ్ వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి చట్టం – 2020కి అసెంబ్లీ ఆమోద ముద్ర వేసిందని సీఎం వెల్లడించారు.
న్యాయశాఖకు ఆదేశాలివ్వండి
రాష్ట్ర హైకోర్టును కర్నూలు తరలించడానికి కేంద్ర న్యాయశాఖకు తగిన ఆదేశాలు ఇవ్వాలని అమిత్‌షాను సీఎం జగన్ కోరారు. రాయలసీమ ప్రాంతంలో శాశ్వత ప్రాతిపదికన హైకోర్టును ఏర్పాటు చేస్తామంటూ భాజపా - 2019 మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాన్ని హోంమంత్రికి సీఎం తెలిపారు.
బుందేల్‌ఖండ్ తరహాలో ప్యాకేజీ
వెనుకబడ్డ జిల్లాలకు ఇప్పటి వరకు రూ.1,050 కోట్లు మాత్రమే వచ్చాయని... మూడేళ్లుగా నిధులు రాలేదని హోం మంత్రికి సీఎం జగన్ తెలిపారు. రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలకు ఇస్తోన్న ప్యాకేజీను కలహండి, బుందేల్‌ఖండ్ తరహాలో విస్తరించాలని అమిత్‌షాకు సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. అలాగే రెవెన్యూ లోటును భర్తీ చేస్తామంటూ ఏపీ పునర్విభజన చట్టంలో పేర్కొన్న సంగతిని గుర్తు చేశారు. దీన్ని పార్లమెంటు సైతం ఏకగ్రీవంగా ఆమోదించిందని వివరించారు. 2014 - 15 నాటికి రెవెన్యూ లోటును రూ.22,949గా కాగ్ నిర్ధరించిందని... ఇందులో ఇంకా రూ.18,969 కోట్లు రావాల్సి ఉందని తెలిపారు. దీనిని ఇప్పించాల్సిందిగా హోంమంత్రిని సీఎం కోరారు. రాజధాని నిర్మాణం కోసం రూ.2,500 కోట్లు కేటాయిస్తే, ఇప్పటివరకూ రూ.1000 కోట్లు మాత్రమే ఇచ్చారని.... మిగిలిన డబ్బును విడుదల చేయాల్సిందిగా విన్నవించారు.
ప్రత్యేక హోదా ఇవ్వండి
ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై తగిన నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వమే తీసుకోవచ్చంటూ 15వ ఆర్థిక సంఘం స్పష్టం చేసిన అంశాన్ని హోంమంత్రి దృష్టికి జగన్ తీసుకొచ్చారు. దీన్ని పరిగణలోకి తీసుకుని ప్రత్యేక హోదాను రాష్ట్రానికి ఇవ్వాలని కోరారు.
పోలవరం నిధులు ఇప్పించండి
పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.838 కోట్లు ఆదా చేశామని అమిత్‌షాకు సీఎం జగన్ తెలిపారు. 2021 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలన్న సంకల్పంతో సాగుతున్నామని వెల్లడించారు. ప్రాజెక్టు రివైజ్డ్ అంచనాలను రూ.55,549 కోట్లుగా కమిటీ ఆమోదించిందని... కేంద్ర జలవనరులశాఖలోని సాంకేతిక కమిటీ ఫిబ్రవరి 2019న ఆమోదించిందని సీఎం వివరించారు. పాలనాపరమైన అనుమతిని త్వరగా పరిష్కరించాలని సీఎం కోరారు. పోలవరం నిర్మాణానికి ప్రభుత్వం చేసిన ఖర్చులో రూ.3,320 కోట్లు రావాల్సి ఉందని... వాటిని ఇప్పించాల్సిందిగా తగిన ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అలాగే పెండింగ్‌లో ఉన్న గ్రాంట్ల విడుదలకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
మండలి రద్దుకు ఆదేశాలివ్వండి
శాసనమండలి రద్దు అంశాన్ని విజ్ఞాపన పత్రంలో సీఎం జగన్ పేర్కొన్నారు. గడచిన రెండు నెలల పరిణామాలను చూస్తే శాసనమండలి మెరుగైన పాలన కోసం ప్రభుత్వానికి సలహాలివ్వాల్సింది పోయి అడ్డుపడే ధోరణితో, పక్షపాతంతో వ్యవహరిస్తోందని వెల్లడించారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం చేసిన బిల్లులను అడ్డుకునే ప్రయత్నం చేసి అపహాస్యం చేసిందని అన్నారు. ఈ నేపథ్యంలో మూడింట రెండు వంతుల మెజారిటీతో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ..... శాసనసభ మండలిని రద్దు చేస్తూ రికమెండ్ చేసిందని స్పష్టం చేశారు. తదనంతర చర్యల కోసం కేంద్ర న్యాయశాఖను ఆదేశించాలని అమిత్‌షాకు జగన్ విజ్ఞప్తి చేశారు.
దిశకు ఆమోదం తెలపండి
మహిళలు, చిన్నారులపై నేరాలను గణనీయంగా తగ్గించేందుకు దిశ చట్టాన్ని తీసుకువచ్చి చరిత్రాత్మక చర్యలను తీసుకున్నామని హోంమంత్రికి సీఎం జగన్ వివరించారు. విచారణను వేగంగా పూర్తి చేసి, నిర్దేశిత సమయంలోగా విచారణ చేసి శిక్షలు విధించడానికి గట్టి చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఏపీ దిశ చట్టానికి ఆమోదం తెలిపాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
'సాగు'కు సహకరించండి
ఏపీ విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఆర్థిక సహాయం అందించాలని సీఎం అమిత్‌షాను కోరారు. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి కోసం కడప స్టీల్ ప్లాంట్, రామాయపట్నం పోర్టు, విశాఖపట్నం- చెన్నై కారిడర్, కాకినాడలో పెట్రోలియం కాంప్లెక్స్ కోసం తగిన ఆర్థిక సహాయం చేయాలని అన్నారు. రాష్ట్రంలో సాగునీటి వసతి మెరుగుపరచడానికి గోదావరి నదిలో నీటిని నాగార్జున సాగర్, శ్రీశైలానికి తరలించే ప్రాజెక్టుకూ తగిన ఆర్థిక సహాయం చేయాలని విన్నవించారు. ఆ మేరకు సంబంధిత శాఖలకు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కోరారు.
రాష్ట్ర పోలీసు విభాగం సమర్థతను పెంచేలా సహాయం చేయాల్సిందిగా హోం మంత్రి అమిత్‌షాను సీఎం జగన్ కోరారు. స్టేట్ ఆపరేషనల్ కమాండ్, కంట్రోల్ సెంటర్, సెంట్రలైజ్డ్ డేటా సెంటర్, ఏపీ పోలీస్ అకాడమీ ఏర్పాటుకు తగిన సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: