అసంఘటిత రంగంలోని కార్మికులకు బీమా సౌకర్యాన్ని కల్పించేందుకు ఉద్దేశించిన వైఎస్ఆర్ బీమా పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. బియ్యం కార్డులున్న 1.41 కోట్ల కుటుంబాలకు ప్రయోజనం కల్పించే విధంగా మొత్తం 510 కోట్ల వ్యయంతో వైయస్సార్ బీమా పథకం అమలు కానున్నట్టు జగన్ స్పష్టం చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ఈ పథకాన్ని ప్రారంభించి.. 510 కోట్ల రూపాయల ప్రీమియంను సీఎం జగన్.. లబ్దిదారులకు సంబంధించిన బ్యాంకు ఖాతాలకు జమ చేశారు. నిరుపేద కుటుంబంలో సంపాదించే వ్యక్తి హఠాత్తుగా మృతి చెందితే ఆ కుటుంబీకులు ఆర్ధికంగా ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ బీమా పథకాన్ని కొనసాగిస్తున్నట్టు సీఎం జగన్ వెల్లడించారు.
ఈ పథకం అమలు నుంచి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా తప్పుకున్నప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం భరిస్తూ పథకం అమలు చేస్తోందని సీఎం వ్యాఖ్యానించారు. బియ్యం కార్డు అర్హత ఉన్న 1.41 కోట్ల కుటుంబాలకు ఉచిత బీమా రక్షణ వర్తిస్తుందని తెలిపారు. పథకంలోని లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగా జరిగిందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పథకంలో భాగంగా 18–50 ఏళ్ల మధ్య ఉన్న లబ్ధిదారులు సహజ మరణం సంభవిస్తే.. వారి కుటుంబానికి 2 లక్షల బీమా అందుతుందని తెలిపారు. 18–50 ఏళ్ల మధ్య ఉన్న వారు ప్రమాదవశాత్తూ మరణించినా.. శాశ్వత వైకల్యానికి గురైనా రూ.5 లక్షల పరిహారం అందుతుందని స్పష్టం చేశారు.
ఇక 51–70 ఏళ్ల మధ్య ఉన్న వారు ప్రమాదవశాత్తూ చనిపోయినా.. శాశ్వత అంగ వైకల్యానికి గురైతే రూ.3 లక్షల బీమా అందుతుందని వెల్లడించారు. ఇంకా 18–70 ఏళ్ల మధ్య ఉన్న వారికి పాక్షిక లేక శాశ్వత అంగ వైకల్యం సంభవిస్తే రూ.1.5 లక్షల బీమా అందుతుందన్నారు.
వైఎస్ఆర్ బీమా పథకంలోని లబ్దిదారులకు వారం రోజుల్లోగా వాలంటీర్లు బీమా కార్డులు అందజేస్తారని సీఎం తెలిపారు. పథకం లబ్ధిదారులకు ఏ సమస్య వచ్చినా.. గ్రామ, వార్డు సచివాలయాలను సంప్రదించవచ్చని సీఎం స్పష్టం చేశారు. ఏదైనా ప్రమాదం జరిగి, కుటుంబ పెద్ద చనిపోతే, క్లెయిమ్ పొందడానికి 15 రోజులు పడుతుందని.. ఆలోగా సదరు కుటుంబానికి తక్షణ సహాయంగా 10 వేలు అందుతుందన్నారు. ఈ అంశం పథకంలో లేకపోయినా.. కొత్తగా అమలు చేయబోతున్నామని సీఎం వెల్లడించారు.
ఇదీ చదవండి: