విద్యార్థి లోకాన్ని ముఖ్యమంత్రి జగన్ నిలువునా మోసగించారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ప్రతి విద్యార్థి చదువుకయ్యే మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుందని చెప్పిన జగన్... ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. లక్ష నుంచి లక్షన్నర వరకూ తానే చెల్లిస్తానని, కాస్మొటిక్ ఛార్జీల కింద 20 వేలు ఏటా అదనంగా చెల్లిస్తానని చెప్పిన వ్యక్తి.... నేడు దాని గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు 16 లక్షల మంది విద్యార్థులకు ఉపకారవేతనాలు, ఇతరేతర బకాయిలు చెల్లిస్తే, జగన్ అధికారంలోకి వచ్చాక ఆ సంఖ్యను 11 లక్షలకు కుదించారని ఆరోపించారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్, మెస్ బిల్లులు చెల్లించకపోవడం వల్ల కళాశాల యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్లు, హాల్ టికెట్లు ఇవ్వడం లేదన్నారు.
నయా మోసగాడిగా మారారు
అధికారంలోకి వచ్చిన నవమాసాల్లోనే జగన్ నయా మోసగాడిగా మారారని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు బ్రహ్మంచౌదరి అన్నారు. జగనన్న వసతి దీవెన పేరుతో విద్యార్థులను, యువతను మోసగించడానికి కొత్త నాటకం మొదలెట్టారని ఆయన దుయ్యబట్టారు. మేనిఫెస్టో తనకు బైబిల్, ఖురాన్, భగవద్గీత లాంటిదని పాదయాత్రలో చెప్పిన జగన్... అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే అన్ని వర్గాలను నిలువునా ముంచేశారని ఆరోపించారు. ఇంటర్, డిగ్రీ, ఎంబీఏ, ఎంసీఏ, ఇంజినీరింగ్ చదివే విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్మెంట్, మెస్ ఛార్జీలతో పనిలేకుండా నెలకు రూ.20 వేలు పాకెట్ మనీగా డబ్బులు అందచేస్తానన్న జగన్మోహన్ రెడ్డి... అధికారంలోకి రాగానే ఆ ఊసే ఎత్తడం లేదని విమర్శించారు.
సీఎం జగన్కు సవాల్
ఎన్నికల ముందు ముఖ్యమంత్రి జగన్ చెప్పిన మాటలకు ఇప్పుడు చేస్తోన్న పనులకు పొంతన లేదని తెదేపా ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మండిపడ్డారు. పెన్షన్ల రద్దు ఆందోళనతో రాష్ట్రంలో వృద్ధులు 30 మంది మృతి చెందారన్నారు. ఉగాదికి పేదలకు ఇళ్ల పట్టాలతో పాటు ఇళ్లు కట్టివ్వాలని డిమాండ్ చేశారు. దమ్ముంటే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఆయన సవాల్ విసిరారు.