రాజ్యసభకు ఎవరెవరిని పంపాలనే కసరత్తు వైకాపాలో మొదలైంది. రాష్ట్రం నుంచి ఖాళీ అవుతున్న 4 స్థానాలూ వైకాపాకే దక్కనున్నాయి. అందుకు అనుగుణంగా నలుగురు అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు సమాచారం. తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి పేర్లు దాదాపు ఖాయమని పార్టీ నేతలు చెబుతున్నారు. 2019 ఎన్నికల్లో ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గం టికెట్‌ను వదులుకున్నందుకు వైవీ సుబ్బారెడ్డికి ఇప్పుడు రాజ్యసభ అవకాశం ఇస్తారని అంటున్నారు. అయోధ్య రామిరెడ్డిదీ దాదాపు వైవీ లాంటి పరిస్థితే. 2014లో నరసరావుపేట నుంచి పోటీ చేసి ఓడిన ఆయన 2019లో బరిలో నిలవలేదు. మొదటి నుంచీ పార్టీకి అండగా నిలిచారన్న కోణంలో ఆయనకు ఇప్పుడు అవకాశం దక్కనుందని చెబుతున్నారు.
రేసులో మంత్రులు మోపిదేవి, చంద్రబోస్
రాష్ట్ర శాసనమండలిని రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినందున ఆ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ పదవులు వదులుకోవాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో వారిద్దరికీ ఇప్పుడే రాజ్యసభ అవకాశం కల్పించాలని సీఎం జగన్ యోచిస్తున్నట్లు పార్టీ ముఖ్యనేతలు చెబుతున్నారు. మండలి రద్దు ఇంకా కొలిక్కి రాలేదు కాబట్టి ఇప్పటికిప్పుడు వారిని మంత్రి పదవుల నుంచి తప్పించి రాజ్యసభకు పంపితే మంత్రివర్గంలోకి కొత్తవారిని తీసుకోవాలి. అందువల్ల మండలి రద్దు ప్రక్రియ పూర్తయ్యాక వీరిద్దరినీ రాజ్యసభకు పంపితే బాగుంటుందన్న చర్చ కూడా పార్టీలో ఉంది. ఇద్దరికీ అవకాశమివ్వడం లేదా ఒకరిని పార్టీ పదవుల్లోకి తీసుకోవచ్చనే వాదన సైతం ఉంది. ఒకరికే అవకాశం కల్పిస్తే, నాలుగో స్థానానికి వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డికి సన్నిహితుడు, ఇటీవలే పార్టీలో చేరిన బీద మస్తాన్‌రావు పేరును పరిశీలిస్తారని చెబుతున్నారు. పార్టీ అవసరాల రీత్యా 2019లో నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గం బరి నుంచి విరమించుకున్న మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి పేరునూ పరిశీలించే అవకాశం లేకపోలేదని అంటున్నారు.
తెదేపాకు అవకాశం లేదు...
వైకాపా అధికారం చేపట్టిన తరువాత తొలి రాజ్యసభ అవకాశం అయినందున ఆశావహులు ఎక్కువగానే ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర అసెంబ్లీలో పార్టీల బలాబలాల ఆధారంగా తెదేపాకు ఇప్పుడు రాజ్యసభకు పోటీ చేసే అవకాశం లేదు. 151 మంది సభ్యులున్న వైకాపాకే 4 స్థానాలు దక్కనున్నాయి.