CM Jagan exercise on cabinet expansion: మంత్రివర్గ విస్తరణపై సీఎం జగన్ కసరత్తు తుది దశకు వచ్చింది. రాజీనామాలు చేసిన పలువురు సీనియర్ మంత్రులు అసంతృప్తిగా ఉన్నారని సమాచారం మేరకు వారిని ఎలా సంతృప్త పరచాలనే విషయమై సీఎం పార్టీ ముఖ్యులతో చర్చించారు. సీఎం జగన్తో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. కేబినెట్ విస్తరణ, అనంతర పరిణామాలపై మూడు గంటలపాటు వీరి మధ్య చర్చ సాగింది.
కేబినెట్‌లో సామాజిక సమీకరణాలతో పాటు.. సీనియర్లు కొనసాగింపుపై చర్చించారు. మంత్రివర్గంలోకి కొత్తగా ఎవరిని తీసుకోవాలనే విషయమై చర్చించినట్లు తెలిసింది. పాత మంత్రుల్లో ఎవరిని కొనసాగించాలి అనే దానిపై ప్రధానంగా చర్చించారు. గరిష్ఠంగా 10మంది వరకు సీనియర్ మంత్రులను కొనసాగించాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. వీటితో పాటు మంత్రి పదవి కోల్పోయిన వారి కోసం జిల్లా అభివృద్ధి మండళ్ల ఏర్పాటు పైనా సమావేశంలో చర్చ జరిగినట్లు తెలిసింది.
చురుగ్గా ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు..: మరో వైపు ఈనెల 11న నూతన మంత్రల ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. సచివాలయం వెలుపల ఉన్న అసెంబ్లీ పార్కింగ్ స్థలంలో ప్రభుత్వ ప్రొటోకాల్ విభాగం ఏర్పాట్లు చేస్తోంది. ప్రమాణ స్వీకారానికి వచ్చే కొత్త మంత్రుల కుటుంబ సభ్యులు, ఉన్నతాధికారులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్రమాణ స్వీకారం తర్వాత తేనీటి విందు ఇవ్వనున్నారు. ముఖ్యమంత్రి సూచనతో కేబినెట్‌లోని 24 మంది మంత్రులు గురువారమే తమ పదవులకు రాజీనామా చేశారు. మంత్రుల నుంచి రాజీనామా లేఖలు తీసుకున్న ముఖ్యమంత్రి.. నిన్న రాత్రి వాటిని గవర్నర్ ఆమోదం కోసం పంపారు.
ఇదీ చదవండి: Nara lokesh: జగన్కు ఉన్నంత ఓపిక, తీరిక మాకు లేదు: లోకేశ్