వైకాపాలో మరోసారి నామినేటెడ్ పదవుల సందడి మొదలైంది. అధికారంలోకొచ్చి రెండేళ్లు పూర్తయిన నేపథ్యంలో వీలైనంత మేర నామినేటెడ్ పదవులను భర్తీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రస్థాయితోపాటు జిల్లా స్థాయిల్లో పట్టణ అభివృద్ధి సంస్థల పదవులనూ భర్తీచేసేందుకు అర్హులను ఎంపిక చేయాలని వైకాపా అయిదుగురు ప్రాంతీయ బాధ్యులకు సీఎం స్పష్టం చేశారని తెలుస్తోంది.
వీరితో ముఖ్యమంత్రి గత సోమవారం సమావేశమై నామినేటెడ్ పదవుల భర్తీపై ప్రాథమికంగా తన అభిప్రాయాలను చెప్పడంతోపాటు, అభ్యర్థుల ఎంపికలో ఎవరికి ప్రాధాన్యమివ్వాలనే అంశంపై కొన్ని సూచనలు చేసినట్లు తెలిసింది. జిల్లాల వారీగా అర్హుల జాబితాను ప్రాంతీయ బాధ్యులు సిద్ధం చేస్తారు. ఇందుకు ఈ వారంలో కసరత్తు పూర్తవ్వచ్చని వైకాపా వర్గాలు తెలిపాయి. అనంతరం ముఖ్యమంత్రి వారితో సమావేశమై జాబితాను పరిశీలించి పేర్లు ఖరారు చేయనున్నారు.
ప్రాధాన్యమిచ్చేదెవరికి?
* మొదటి నుంచి పార్టీలో పనిచేస్తున్నవారు, అర్హతలుండీ ఎమ్మెల్యే టికెట్ పొందలేకపోయినవారు, పార్టీ అవసరాల కోసం టికెట్ వదులుకున్నవారు. రాష్ట్రస్థాయి పదవుల్లో వీరికి అవకాశం కల్పించాలని నిర్ణయించినట్లు సమాచారం.
* ఇటీవల స్థానికసంస్థల ఎన్నికల సందర్భంగా మేయర్, జడ్పీ ఛైర్మన్ వంటి పదవులను ఆశించి భంగపడినవారికి జిల్లాస్థాయి నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించడం..వీరిలో నాయకుల స్థాయి ఆధారంగా వారి అభ్యర్థిత్వాన్ని రాష్ట్ర పదవులకు పరిశీలించడం.
* మహిళలకు ఎప్పటిలాగే 50% మేర అవకాశం.
ఇదీ చదవండి: