Statue of Equality: గత 12 రోజులుగా శోభాయమానంగా జరిగిన సమతామూర్తి సహస్రాబ్ది వేడుకలు ఘనంగా ముగిశాయి. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలో.. చివరి రోజున యాగశాలలో సహస్ర కుండలాల లక్ష్మీనారాయణ మహాయాగాన్ని 5 వేల మంది రుత్వికులు సుసంపన్నం చేశారు. మహాయజ్ఞం ఆవాహనంతో 1035 పాలికల్లోని సంప్రోక్షణ జలాలతో సమతామూర్తి స్వర్ణ విగ్రహానికి చినజీయర్ స్వామి ప్రాణప్రతిష్ఠ చేశారు. అనంతరం ప్రవచన మండపంలో రుత్వికులతో చినజీయర్ స్వామి సమావేశం అయ్యారు.
శ్రీరామనగరంలో ఈ రాత్రికి 108 ఆలయాల్లో నిర్వహించాల్సిన శాంతి కల్యాణాన్ని వాయిదా వేస్తున్నట్లు చినజీయర్ స్వామి ప్రకటించారు. వచ్చే శనివారం అత్యంత వైభవంగా, చరిత్రలో నిలిచిపోయే విధంగా కల్యాణం నిర్వహించనున్నట్లు తెలిపారు. సమతామూర్తి సంకల్పం ప్రారంభించిన నుంచి ఎంతో మంది భక్తుల సంపాదన.. రామానుజుల సమతామూర్తి కేంద్ర నిర్మాణంలో ఉందని వెల్లడించిన చినజీయర్ స్వామి.. ముఖ్య కార్యనిర్వాహకులైన జూపల్లి రామేశ్వర్రావు, వనజా భాస్కర్‌రావుకు ధన్యవాదాలు తెలిపారు.
లక్షలాది మంది భక్తులు, వికాస తరంగిణి కార్యకర్తలు, అర్చకుల వైదిక క్రతువు.. సహస్రాబ్ది వేడుకలకు వన్నె తెచ్చాయని హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మహాయాగంలో భాగస్వాములైన రుత్వికులను చినజీయర్ స్వామి సన్మానించారు. ఈనెల 19న జరిగే శాంతి కల్యాణానికి అవకాశం ఉన్న రుత్వికులంతా రావాలని ఆహ్వానించారు.
ఇదీచూడండి:
Statue Of Equality News : సమతా మూర్తి విగ్రహానికి ఘనంగా ప్రాణ ప్రతిష్ఠాపన