బడుల విలీనంపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. ఇళ్లకు దగ్గరగా ఉన్న పాఠశాలల్లో హాయిగా చదువుకుంటున్న తమ బుజ్జాయిలు ఇప్పుడు కిలోమీటర్ల కొద్దీ వెళ్లి రావాల్సిన దుస్థితి దాపురించిందని తల్లిదండ్రులు వాపోతున్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు బుధవారం బడుల ముందు ధర్నాకు దిగారు. కొందరు పాఠశాలలకు తాళాలు వేసి మరీ నిరసన తెలిపారు.
ఒకడే ఒక్కడు మిగిలాడు..

కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం కారుపల్లిపాడులోని ప్రాథమిక పాఠశాలకు చెందిన 3, 4, 5 తరగతులు స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో విలీనం చేశారు. దీంతో ఇక్కడ 2వ తరగతి చదువుతున్న ఒకే ఒక్క విద్యార్థి మిగిలాడు. ఆ బాలుడికి ఉపాధ్యాయుడు శ్రీనివాస్ బుధవారం పాఠాలు బోధిస్తూ కనిపించారు. ఈ ఒక్క విద్యార్థికి మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకురాలు ఇంటి దగ్గర వంట చేసుకొని భోజనం తీసుకురావడం గమనార్హం.
ఉన్న చోటే కొనసాగించాలి.. విలీనాన్ని ఆపేయాలని నంద్యాల జిల్లా మిడుతూరు మండలం అలగనూరు, ఉప్పలదడియ గ్రామాల ప్రజలు కోరారు. అలగనూరులోని ప్రాథమిక పాఠశాల గేటుకు తాళాలు వేసి నిరసన తెలిపారు.

తమ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలోనే 3, 4, 5 తరగతులను కొనసాగించాలని ఉప్పలదడియ గ్రామస్థులు ఆందోళనకు దిగారు. పాఠశాలను సందర్శించిన ఎంఈవో మౌలాలికి దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. ఈ విషయమై గ్రామస్థులు ఎంఈవోను నిర్బంధించారని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగింది. ఎంఈవో మౌలాలిని వివరణ కోరగా అలాంటిదేమీ లేదన్నారు.
హైవే దాటడం ప్రమాదకరం..పాఠశాల ముందు నిరసన తెలుపుతున్న వీరంతా... విజయనగరం జిల్లా చెల్లూరు గ్రామస్థులు. గ్రామ పాఠశాలకు చెందిన 6, 7, 8 తరగతుల్ని మలిచర్ల పాఠశాలలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ బుధవారం విద్యార్థులు, తల్లిదండ్రులు పాఠశాల గేటు ఎదుట ధర్నాకు దిగి, పాఠశాల గేటుకు తాళం వేశారు.

తమ పిల్లలు మలిచర్లకు వెళ్లాలంటే నిత్యం రద్దీగా ఉండే జాతీయ రహదారిని దాటాలని, ఇది ఎంతో ప్రమాదకరమని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి:
మట్టి మింగేస్తున్నారు.. అడ్డుకుంటే దాడులు.. ఫిర్యాదు చేస్తే అంతుచూస్తామని బెదిరింపులు!