Child marriages in AP రాష్ట్రంలో బాల్య వివాహాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ వివాహాలవల్ల యుక్త వయసులో గర్భదారణ, హెచ్‌ఐవీ బారినపడటం వంటి సమస్యలు ఎక్కువగా ఎదురవుతున్నాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ రికార్డుల ప్రకారం.. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు నమోదైన గర్భిణుల వివరాలు పరిశీలిస్తే 2000 మందికి చిన్న వయసులోనే వివాహమైనట్లు తేలింది. అత్యధికంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 213 మంది, అతి తక్కువగా పశ్చిమగోదావరి జిల్లాలో ఒకరు ఈ జాబితాలో ఉన్నారు.
చిన్న వయసులోనే గర్భంతో తల్లీబిడ్డలకు ముప్పు: చిన్న వయసులోనే గర్భం దాల్చడం ద్వారా తల్లీబిడ్డలు ప్రాణాపాయ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. తక్కువ బరువుతో పుట్టడం, పౌష్ఠికాహార లోపం, రక్తహీనత వంటి అనారోగ్య సమస్యలు శిశువులను వెంటాడుతున్నాయి. బాల్య వివాహాల నియంత్రణకు పాఠశాల విద్య నుంచి ప్రయత్నాలు జరుగుతున్నా పూర్తిస్థాయిలో సత్ఫలితాలు కనిపించడం లేదు. పేదరికం, నిరక్షరాస్యత, బాలికలను జాగ్రత్తగా పెంచలేమని తల్లిదండ్రుల అభద్రతాభావం, మూఢాచారాలు, ఇంట్లో వృద్ధుల ఒత్తిడి వంటివి చిన్న వయసులోనే పెళ్లిళ్లకు కారణాలవుతున్నాయని అధికారులు చెబుతున్నారు.
గర్భస్రావాలు ఎక్కువ
సాధారణ వయసులో వివాహాలు జరిగినవారితో పోల్చితే చిన్నవయసులో గర్భం దాల్చిన వారిలో కాన్పు సమయంలో మరణాలు రెండింతలు ఎక్కువగా ఉంటున్నాయి. గర్భసంచి వయసుకు తగ్గట్లుగా లేకపోవడం వల్ల గర్భస్రావాలూ ఎక్కువగా జరుగుతున్నాయి. నెలలు నిండకముందే ప్రసవాలు, కాన్పు సమయంలో అధిక రక్తస్రావంతో ప్రాణాపాయ స్థితిలోకి వెళుతున్నారు. సాధారణ ప్రసవాలు తక్కువగా ఉంటున్నాయి. ప్రసవం జరిగిన తర్వాత కోలుకోవడానికీ ఎక్కువ సమయం పడుతోంది.
* శిశు మరణాల్లో 45.3% బాల్యంలో వివాహాల ద్వారా జరుగుతున్నాయని వైద్య, ఆరోగ్యశాఖ పరిశీలనలో తేలింది. ప్రసవ సమయంలో 42.3% మంది శిశువులు మరణిస్తున్నారు.
రాష్ట్రంలో ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు నమోదైన గర్భిణుల వివరాల ప్రకారం బాల్యవివాహాల లెక్క ఇదీ..
ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్-5 ప్రకారం..
జాతీయ ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ-5 అధ్యయనం ప్రకారం 20-24 మధ్య వయసున్న 29.3% మహిళలకు 18 ఏళ్లలోపే వివాహాలు జరిగాయి. వీరిలో 21.7% పట్టణ ప్రాంతాల్లో, 32.9% గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు. వీరిలో 29.3% మంది 15-19 ఏళ్ల మధ్యే గర్భం దాల్చినట్లు అధ్యయనంలో తేలింది. బాల్యవివాహాల్లో పశ్చిమబెంగాల్ (41.6%), బిహార్ (40.8%), త్రిపుర (40.1%), అస్సాం (31.8%) తర్వాత స్థానంలో ఏపీ ఉంది.
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 37.3%, అనంతపురం 37.3%, కర్నూలు 36.9%, గుంటూరు 35.4%, విజయనగరం జిల్లాలో 33.7% మందికి 18 ఏళ్ల ముందు వివాహాలు జరిగాయి.
సర్వే జరిగే నాటికి.. చిన్న వయసులోనే గర్భం దాల్చిన వారు అత్యధికంగా గుంటూరు జిల్లాలో 20.7% ఉన్నారు. చిత్తూరు జిల్లాలో 19.7%, ప్రకాశం 16.4%, నెల్లూరు 14.9%, అనంతపురం 13.6% కర్నూలు జిల్లాలో 12.4% బాల్యంలోనే గర్భం దాల్చారు.
ఇవీ చదవండి: