Chandrababu on polavaram: పోలవరం ప్రాజెక్టులో కాఫర్ డ్యామ్ నిర్మాణం పూర్తయి ఉంటే ఎంత వరద వచ్చినా డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయి ఉండేది కాదని.. జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ నిర్వాకమే అందుకు కారణమని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. వైకాపా ప్రభుత్వ తప్పుల వల్లే పోలవరం ప్రాజెక్టు నిర్వీర్యమైందని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా జగన్ అబద్ధాలు చెబుతున్నారని వ్యాఖ్యానించారు. తెదేపా 40 వసంతాల ఆవిర్భావ వేడుకల లోగోను మంగళగిరిలోని తెదేపా జాతీయ కార్యాలయంలో శుక్రవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి పునరావాసం, భూసేకరణ సహా నిర్మాణానికి అయ్యే ఖర్చు మొత్తం భరిస్తామని తెదేపా హయాంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారన్నారు.
వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇప్పుడు ఈ ప్రాజెక్టుకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. కేవలం రూ.15,600 కోట్లే ఇస్తామని కేంద్రం చెబుతోందని.. అలాంటప్పుడు మిగతా రూ.40 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందా? ఆ నిధుల్ని ఎక్కడి నుంచి తెస్తుందని ప్రశ్నించారు. ‘అసలు అసెంబ్లీ సమావేశాలు జరిగాయా? ఈ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యతారహితంగా ప్రవర్తించింది. జంగారెడ్డిగూడెంలో 27 మంది కల్తీసారా తాగి మృతి చెందితే ప్రభుత్వం కనీసం ఆ అంశంపై ప్రకటనైనా చేయలేదు. జగన్‌మోహన్ రెడ్డిది కల్తీ ఎక్సైజ్ విధానం. ఉత్పత్తి నుంచి అమ్మకం వరకూ మొత్తం ఆయన ఆధీనంలోనే కొనసాగుతోంది. ఈ వ్యవహారంలో జగన్‌ను వదిలేది లేదు’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
వాడవాడలా తెదేపా ఆవిర్భావ దిన వేడుకులు: ఈ నెల 29న తెదేపా 40 ఏళ్లు పూర్తి చేసుకుని 41వ వసంతంలోకి అడుగుపెడుతోంది. ఆవిర్భావ దినోత్సవాన్ని వాడవాడలా నిర్వహించాలి. ఉదయం 9 గంటలకు అన్ని గ్రామాల్లో పార్టీ జెండాలు ఆవిష్కరించాలి. ప్రధాన కేంద్రాల్లో ఫ్లెక్సీలు పెట్టాలి. సాయంత్రం అన్ని గ్రామాల నుంచి కార్యకర్తలందరూ వాహనాలకు తెదేపా జెండాలు కట్టుకుని నియోజకవర్గ కేంద్రాలకు తరలిరావాలి. పార్టీ కోసం పునరంకితమయ్యేలా ఆవిర్భావ వేడుకలు జరపాలి.
తెదేపా హయాంలో ప్రవేశపెట్టిన పథకాలే ఇప్పుడు దేశవ్యాప్తంగా అమలవుతున్నాయి. బీసీలకు రాజకీయ గుర్తింపు ఇచ్చింది మన పార్టీయే. మనం చేపట్టిన కార్యక్రమాలతో సమాజానికి ఎలా లాభం కలిగిందో, భావితరాలకు తెదేపా ఎంత అవసరమో శ్రేణులు ప్రజలకు వివరించాలి. హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో తెదేపాను ఎన్టీఆర్ స్థాపించారు. ఆ ప్రదేశాన్ని ఈ నెల 29న సందర్శిస్తాం. తర్వాత ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులర్పిస్తాం. అనంతరం ఎన్టీఆర్ భవన్‌లో సమావేశం నిర్వహించి 40 ఏళ్ల ప్రస్థానాన్ని మననం చేసుకుంటాం. పొలిట్‌బ్యూరో సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఎన్‌ఆర్‌ఐ తెదేపా ఆధ్వర్యంలో విదేశాల్లోనూ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహిస్తాం.
ఇదీ చదవండి: యూకేలో తెదేపా 40వ వార్షికోత్సవం.. 40కిపైగా నగరాల్లో సంబరాలు!