మూడేళ్ల డిగ్రీలోనే 10 నెలలు అప్రెంటిస్షిప్ ఉండేలా కోర్సును ఉన్నత విద్యామండలి రూపొందించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి దీన్ని అమలు చేయనుంది. ఉన్నత విద్యా మండలి నిర్వహించిన సమావేశంలో డిగ్రీ పాఠ్యాంశాలపై నిర్ణయం తీసుకుంది. పాఠ్యాంశాల రూపకల్పన దాదాపుగా పూర్తయింది.
కోర్సులు ఉండేది ఇలా...
* మూడేళ్ల డిగ్రీలో 6 సెమిస్టర్లు ఉంటాయి. ఇందులో ఆరో సెమిస్టర్లో 6 నెలల పాటు విద్యార్థులకు అప్రెంటిస్షిప్ ఉంటుంది. ఇందుకు 15 క్రెడిట్లు ఇస్తారు.
* డిగ్రీ మెుదటి, రెండో ఏడాదిలోని వేసవి సెలవుల్లో రెండేసి నెలలు చొప్పున అప్రెంటిస్షిప్ నిర్వహిస్తారు. ఈ నాలుగు నెలలకు కలిపి 8 క్రెడిట్లు ఉంటాయి. మెుత్తం 10 నెలలకు 23 క్రెడిట్లు ఇస్తారు.
* జీవన నైపుణ్యాల్లో 15 సబ్జెక్టులు, నైపుణ్యాల పెంపులో 30 సబ్జెక్టులు, నైపుణ్యాభివృద్ధిలో 25 సబ్జెక్టులు ఉంటాయి. వీటిల్లో నుంచి ఆసక్తి ఉన్న సబ్జెక్టులను విద్యార్థులు ఎంచుకోవచ్చు.
* పోస్టు గ్రాడ్యుయేషన్లో ఏదైనా రెండు సబ్జెక్టులను ఎంచుకునే అవకాశం లభించేలా ఈ కోర్సులను రూపొందించారు.
* వర్సిటీలు, కశాలలు తమ స్థానికతకు అనుగుణంగా సబ్జెక్టులను ప్రవేశపెట్టుకోవచ్చు.
డిగ్రీలో మార్కెట్ ఆధారిత కోర్సులు..
ప్రభుత్వ, ఎయిడెడ్, స్వయంప్రతిపత్తి డిగ్రీ కళాశాల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి మార్కెట్ అవసరాలకు అనుగుణమైన 25 కోర్సులను ప్రవేశ పెట్టేందుకు ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త పోస్టుల మంజూరు, ఎలాంటి నిధుల కేటాయింపు లేకుండానే ఈ కోర్సులను నిర్వహించేందుకు అనుమతించింది.
ప్రస్తుతం స్వయంప్రతిపత్తి డిగ్రీ కళాశాలల్లో ఉన్న ఈ కోర్సులను అన్ని కళాశాలల్లోనూ అందుబాటులోకి తీసుకురానున్నారు. మూడేళ్ల డిగ్రీలో నాలుగు, ఆరు సెమిస్టర్లలో విద్యార్థులు ఎంచుకున్న కోర్సులకు అనుగుణమైన కంపెనీలు, సంస్థల్లో విద్యార్థులకు అప్రెంటిస్షిప్ ఉంటుంది. ఒక్కో కోర్సులో 30 మంది విద్యార్థులుండేలా ప్రణాళిక రూపొందించారు.
ఇదీ చదవండి: కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రానికి ఈ ఏడాదే శంకుస్థాపన