ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో విజ్ఞానం, సాంకేతికత రెండూ అనుసంధానం కావాలని తెదేపా అధినేత చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఇందుకు ప్రపంచంలోని తెలుగువారి అందరి అభిప్రాయాలూ తెలుసుకుని విజ్ఞానం పంచుకుందామని ఆయన పిలిపునిచ్చారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ దేశాల్లో ఉన్న తెలుగువారితో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజాశ్రేయస్సు కోసం తమ వంతు చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి సహకారం ఇచ్చి ఎన్నో సూచనలు ఇస్తున్నా వినే పరిస్థితుల్లో లేదని విమర్శించారు. అధ్యయనం ద్వారా ఉత్తమ విధానాలను ప్రోత్సహించాలనుకుంటున్నామని చంద్రబాబు తెలిపారు.
టచ్ పాయింట్స్ తగ్గించేందుకు ఎక్కువ డిజిటల్ లావాదేవీలు జరగాలన్న ఆయన.. ఇందుకు ప్రభుత్వాలపరంగా రాయితీలు కూడా ఉండాలని అభిప్రాయపడ్డారు. ఆన్‌లైన్ ద్వారా డోర్ డెలివరీ విధానాలు ప్రోత్సహించాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారంతా రాష్ట్రం కోసం తోచిన సాయం చేసేందుకు ముందుకు రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రధాని కోరిక మేరకు అందరి అభిప్రాయాలు తీసుకుని మరో నివేదిక పంపుతానని తెలిపారు. చైనాలో వచ్చినప్పుడు అక్కడే నియంత్రించి ఉంటే ప్రపంచమంతా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చేది కాదన్న చంద్రబాబు.. ఇప్పుడు ధైర్యంగా ఎదుర్కొవటం తప్ప మరో మార్గం లేదని వ్యాఖ్యానించారు. లాక్‌డౌన్ కూడా ఎక్కువ రోజులు కొనసాగితే వేరే ఇబ్బందులు వస్తాయని కొన్ని రోజువారీ కార్యక్రమాలు కూడా జరిగే విధంగా ప్రత్యామ్నాయాలు కూడా చూడాలన్నారు. ఆర్ధిక వ్యవస్థ ఎంత దెబ్బతింటుందో కూడా ఇప్పుడే అర్ధం కావట్లేదన్నారు.
ఇదీ చదవండి: