వైకాపా ప్రభుత్వంపై తెదేపా అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌పై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని... దీనిని తీవ్రంగా తప్పుబడుతున్నామని అన్నారు. ఎస్ఈసీ కేంద్రానికి లేఖ రాస్తే రాజకీయ పార్టీల ప్రమేయం ఉందని చెప్పడమేంటని ప్రశ్నించారు. తనతో పాటు కుటుంబసభ్యులకు ప్రాణహానీ ఉందంటూ ఎస్ఈసీ కేంద్రానికి లేఖ రాశారని... తనకు భద్రత ఉంటే తప్ప విధులు నిర్వర్తించలేనని లేఖలో ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. ఎన్నికల కమిషనర్ కోరిన మేరకు సీఆర్పీఎఫ్ సిబ్బందితో భద్రత కల్పించారని చెప్పారు. ప్రభుత్వ అరాచకాలపై అన్ని పార్టీలు ఎప్పటికప్పుడు ఎస్ఈసీకి తెలిపామని చంద్రబాబు పేర్కొన్నారు.
'కరోనా కారణంతోనే ఎన్నికలను వాయిదా వేశారు. రాష్ట్రంలో అనేక చోట్ల కేసులు నమోదు అవుతున్నాయి. మేం ఏం చెప్పామో అదే బయటపడుతోంది. దేశం మొత్తం అప్రమత్తమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతారా..?. కేంద్ర ప్రభుత్వం చెప్పిన సూచనలను పట్టించుకోలేదు. ఇన్ని రోజుల తర్వాత వైద్యఆరోగ్య శాఖ మంత్రి మీడియా ముందుకు వచ్చి సూచనలు చేశారు. ఎస్ఈసీ రాసిన లేఖను వక్రీకరిస్తారా..? ఆ లేఖ నిజమో కాదో కేంద్రాన్ని అడిగి తెలుసుకోవచ్చు కదా. కానీ అలా చేయకుండా ఎస్ఈసీపై మాటల దాడులు చేస్తున్నారు.సమాచార హక్కు చట్టం ద్వారా కూడా లేఖ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాసిందేనని ధ్రువీకరణ అయింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ భద్రత సమస్య ఉందని చెప్పే పరిస్థితి రావడం ప్రభుత్వానికి సిగ్గుచేటు. మీకు 151 సీట్లు వస్తే ప్రశ్నించకూడదా..? రాష్ట్ర ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం.' -చంద్రబాబు, తెదేపా అధినేత
కరోనా రాదు అంటూ సీఎస్ చెప్పిన వ్యాఖ్యలపై చంద్రబాబు ప్రశ్నలు సంధించారు. రెండు, మూడు వారాల వరకు కరోనా రాదు అంటూ సీఎస్ చెప్పారని... కానీ ఇవాళ పరిస్థితి వేరుగా ఉందని అన్నారు. దీనిపై సీఎస్ ఏం స్పందిస్తారని ప్రశ్నించారు.
ఇదీ చదవండి :