ప్రపంచవ్యాప్తంగా ఏ నోటా విన్నా కరోనా గురించే మాట్లాడుకుంటున్నారని తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. ఈ వైరస్ ప్రపంచ వ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోందని తెలిపారు. దేశంలోనూ వీటి కేసుల సంఖ్య పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితులుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి పారాసిటమాల్, బ్లీచింగ్ పౌడర్ అంటూ ఉదాసీనంగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం వ్యాఖ్యలను జాతీయ మీడియా సైతం తప్పుబట్టిందని చెప్పారు.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేఖ రాయడంపై చంద్రబాబు మండిపడ్డారు. 'రాష్ట్రంలో ఒకే ఒక్క కరోనా పాజిటివ్ కేసు వచ్చిందని..అంతా ప్రశాంతంగానే ఉందని కనీస బాధ్యత లేకుండా ఎలా చెబుతారు? కరోనాపై సీఎస్‌కు కనీస అవగాహన ఉందా ..? మార్గదర్శకాలు చదివారా..? ఫ్రాన్స్ లో నిన్న ఎన్నికలు జరిగితే 20 శాతం ఓట్లు తగ్గాయి. నాలుగైదు వారాల్లో వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. అసలు సీఎస్ కు బాధ్యత లేదా..? కరోనా నియంత్రణకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు. రాష్ట్రానికి ఆరు వేలకు పైగా విదేశాల నుంచి వచ్చారు. వారి చిరునామాలు మీకు తెలుసా? తీవ్రత అర్థమవుతుందా' అని చంద్రబాబు ప్రశ్నించారు.
కరోనాతో దేశంలోని అన్ని రాష్ట్రాలు అప్రమత్తమవుతుంటే... రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవ్వడం ఏంటని నిలదీశారు. ఎన్నికలు వాయిదా వేసిన ఈసీపైనా విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇంతటి ధ్యాస కరోనా నియంత్రణపై లేకపోవడం రాష్ట్ర ప్రజల దురదృష్టకరం అని అన్నారు. అలాగే.. కరోనా నియంత్రణకు సంబంధించి చంద్రబాబు ప్రజలకు పలు సూచనలు చేశారు.
ప్రజారోగ్యంతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ ఉన్మాదంతో వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. 4 వేల కోట్లు అపేశారని అంటున్నారని.. ఇన్ని రోజులు ఎన్నికలు నిర్వహించకుండా ఏం చేశారని ప్రశ్నించారు. తమ పార్టీకి చెందిన కొందరు కార్యకర్తలను ఐటీ సెక్షన్ల కింద అరెస్టు చేస్తున్నారని అన్నారు. తమ పార్టీకి చెందిన సోషల్ మీడియా వాళ్లను అరెస్ట్ చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. వైకాపా వాళ్లు కూడా ఇష్టానుసారంగా పోస్టులు చేస్తున్నారని...వారిని ఎక్కడైనా అరెస్ట్ చేశారా అని ప్రశ్నించారు. వీటన్నింటిపై పోలీసులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో తమ పార్టీకి చెందిన అభ్యర్థులతో బలవంతంగా విత్ డ్రా చేయించారని చంద్రబాబు ఆరోపించారు. వీటన్నింటిపై న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు.