తెదేపా అధినేత చంద్రబాబు రేపు రాజధాని ప్రాంతంలో పర్యటించనున్నారు. తెదేపా ప్రభుత్వ హయాంలో చేసిన పనులను ఆయన మీడియా ప్రతినిధులకు వివరించనున్నారు. ఈ సందర్భంగా అక్కడి రైతులతోనూ మాట్లాడతారు. తెదేపా హయాంలో రాజధానిలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని మంత్రులు, వైకాపా నేతలు పదేపదే విమర్శిస్తున్న తరుణంలో... రేపటి చంద్రబాబు పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే ఓ మారు తెదేపా నేతలు పర్యటించి... తమ ప్రభుత్వ హయాంలో చేసిన పనులను వివరించారు. ఇప్పుడు చంద్రబాబు స్వయంగా పర్యటించనున్నారు.
పర్యటన సాగనుందిలా...!
ఉదయం సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కనే బలహీనవర్గాల కోసం నిర్మించిన గృహ సముదాయాన్ని చంద్రబాబు సందర్శిస్తారు. ఆ తర్వాత అఖిల భారత సర్వీసు అధికారులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ఉద్యోగుల కోసం నిర్మిస్తున్న భవనాలను పరిశీలిస్తారు. కడప జిల్లా పర్యటన ముగించుకొని అమరావతి వచ్చిన చంద్రబాబు... పార్టీ నేతలతో రేపటి పర్యటనపై సమావేశమయ్యారు. పర్యటనకు అవాంతరం కలిగించేందుకు వైకాపా కుట్రలు పన్నుతోందని నేతలు ఈ సందర్భంగా చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. కొందరు పెయిడ్ ఆర్టిస్టులను రైతులుగా చిత్రీకరిస్తూ... పర్యటన అడ్డుకునే యత్నం జరుగుతోందని వారు వివరించారు.
పర్యటనకు వచ్చిన వారిని ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టి ఎస్సీ, ఎస్టీ కేసులు బనాయించేలా ప్రభుత్వ పెద్దలు కుట్రపన్నారని ఆరోపించారు. ఆత్మ గౌరవానికి ప్రతీక అయిన అమరావతిని కాపాడుకునేందుకు ఈ పర్యటన జరిగి తీరాలన్న చంద్రబాబు... కుట్రలన్నింటినీ ఛేదిద్దామని నేతలకు పిలుపునిచ్చినట్లు తెలిసింది.
ఇదీ చదవండి : నైపుణ్యాభివృద్ధిలో రాష్ట్రానికి రెండు పురస్కారాలు