తెలుగుదేశం అధినేత చంద్రబాబు కాసేపట్లో ఆత్మకూరు బయల్దేరనున్నారు. చలో ఆత్మకూరు ఆగదని... బాధితుల వద్దకు వెళ్తానని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన తెలుగుదేశం నేతలు, శ్రేణుల అరెస్టులను చంద్రబాబు ఖండించారు. పోలీసుల వైఖరిని తప్పుపట్టారు. మహిళ నేతలని చూడకుండా దురుసుగా ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. నన్నపనేని రాజకుమారి, అఖిల ప్రియ, వంగలపూడి అనిత, బండారు శ్రావణిని అవమానించారని ఆరోపించారు. పోలీసు స్టేషన్ల చుట్టూ తిప్పడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాము చేపట్టిన చలో ఆత్మకూరు కార్యక్రమాన్ని అరెస్టులతో ఆపలేరని.. కొనసాగించి తీరుతామని చంద్రబాబు తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయన ఇంటి చుట్టూ పోలీసులు భారీగా మోహరించారు.
వేకువజాము నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ నేతలను శ్రేణులను పోలీసులు అరెస్టు చేశారు. ఎవరూ ఆత్మకూరు చేరుకోకుండా అడ్డుకున్నారు. మహిళా నేతలనూ ఉన్నచోటే నిర్బంధించారు. కొందరు కీలక నేతలను ఇంటి నుంచి బయటకు రానివ్వకుండా కట్టుదిట్టం చేశారు. పార్టీ నేతలతో ఫోన్‌లో మాట్లాడిన చంద్రబాబు.. పోలీసుల చర్యలను ఖండించారు. ప్రభుత్వం తీరును తప్పుపట్టిన ఆయన... ఎలాగైనా చలో ఆత్మకూరు నిర్వహించి తీరుతామని స్పష్టం చేశారు.