కృష్ణా, గోదావరి వరదల కారణంగా తీవ్రంగా పంట, ఆస్తి నష్టం జరగటంపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. విపత్తు నిర్వహణ చేతకాకపోతే ఇక ప్రభుత్వాలెందుకని ట్విట్టర్లో ప్రశ్నించారు.
''నీరు-చెట్టు కార్యక్రమంపై వైకాపా వాళ్లంతా నానా రకాలుగా మాట్లాడుతున్నారు. ఈరోజు ఇదే కార్యక్రమానికి దేశమంతంటా ప్రశంసలు వస్తున్నాయి. మా పాలనలో సమర్థ నీటి నిర్వహణ వలన నీతి ఆయోగ్ ఏపీకి జాతీయ స్థాయిలో రెండో ర్యాంకు ఇచ్చింది. మరి వైకాపా సంగతేంటి?. రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత వల్లే కృష్ణా, గోదావరి వరదల్లో 4 జిల్లాల్లో వేలాది కోట్ల పంట, ఆస్తి నష్టం జరిగింది. తెదేపా పాలనకు, వైకాపా పాలనకు అదే తేడా" అని చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. హుద్‌హుద్ తుపాను సమయంలో తెదేపా ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలను చంద్రబాబు నాయుడు వివరించారు. నాటి స్ఫూర్తి ఇప్పుడీ కృష్ణా, గోదావరి వరదల్లో ఏమైందని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.