Chandrababu on itdp meeting : చేతకానివాళ్లే కులం, మతం, ప్రాంతాల గురించి మాట్లాడతారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు దుయ్యబట్టారు. సమర్థులు మాత్రం అభివృద్ధి గురించి ఆలోచన చేస్తారని అన్నారు. తెలుగువారే తన కులం, తన మతమని, తెలుగువారంతా తన కుటుంబ సభ్యులే అని పేర్కొన్నారు. వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వైకాపాకు అడ్రెస్ లేకుండా చేయాల్సిన బాధ్యత ఐటీడీపీ కార్యకర్తలదే అని చంద్రబాబు సూచించారు.
గుండెపోటుతో మొదలై గొడ్డలిపోటు దాకా..
గుండెపోటు పేరు చెప్పి బాబాయిపై గొడ్డలిపోటు వేశారని.. పైగా సిగ్గు లేకుండా సీబీఐపై ఎదురుదాడికి దిగారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ సినిమాలోనూ చూడని విధంగా బాబాయిని హత్య చేశారని దుయ్యబట్టారు. రూ.40కోట్ల సుపారీ ఎవరి రక్తచరిత్ర అని నిలదీశారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో తెలుగుదేశం పార్టీ సామాజిక మాధ్యమం(ఐటీడీపీ) సభ్యుల ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.
బ్లూ మీడియాలో చూపించకపోతే.. ప్రజలకు నిజం చేరదా..?
అమరావతి తీర్పును బ్లూ మీడియాలో చూపించనంత మాత్రాన నిజం ప్రజలకు చేరకుండా ఆగిందా? అని చంద్రబాబు ప్రశ్నించారు. సామాజిక మాధ్యమానికి ఉన్న శక్తి ఏపాటిదో అందరూ తెలుసుకోవాలన్నారు. సెల్ ఫోన్‌లే ఐటీడీపీ కార్యకర్తల ఆయుధాలని పేర్కొన్నారు. నిజాలను వెలికితీయటంలో ఐటీడీపీ కార్యకర్తలు చురుగ్గా పనిచేయాలని సూచించారు.
25ఏళ్ల క్రితం ఫోన్లను ప్రమోట్ చేస్తే తనను ఎగతాళి చేశారని.. నేడు తిండిలేకపోయినా ఉండగలరు కానీ ఫోన్ లేకుండా ఉండలేని పరిస్థితి ఉందన్నారు. హైదరాబాద్‌లో నాటిన హైటెక్ సిటీ విత్తనం ప్రజల కోసమేనని చెప్పారు. ఈ కార్యక్రమానికి పార్టీ నేతలు అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అయ్యన్నపాత్రుడు, సోమిరెడ్డి, చింతకాయల విజయ్‌తోపాటు పార్టీ కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చారు.
ఇదీ చదవండి: Polavaram Visit: పోలవరం నిర్మాణానికి పూర్తి సహకారం అందిస్తాం: షెకావత్