CBN IN TDLP MEETING : అమరావతి రైతులపై ఆరోపణలు చేస్తున్న మంత్రుల వైఖరిని తెదేపా శాసనసభాపక్షం తీవ్రంగా ఖండించింది. అసెంబ్లీ వాయిదా అనంతరం ఉండవల్లి లోని నివాసంలో చంద్రబాబు పార్టీ ఎమ్మెలేలు ఎమ్మెల్సీలతో తెదేపా శాసనసభ పక్ష సమావేశం నిర్వహించారు. అసెంబ్లీలో రాజధాని అంశంపై ప్రభుత్వ వైఖరి, సీఎం ప్రసంగం తదితర అంశాలపై నేతలు సుదీర్ఘంగా చర్చించారు. జగన్ సహా అందరి ఆమోదంతోనే రాజధానిగా అమరావతిని ఖరారు చేశామని చంద్రబాబు గుర్తు చేశారు. తెలుగుదేశం ఇదే అంశానికి ఇప్పటికీ కట్టుబడి ఉందని తేల్చిచెప్పారు. స్వార్ధ రాజకీయాల కోసం ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతూ అమరావతిపై...సీఎం మాట తప్పి, మడమ తిప్పరాని మండిపడ్డారు. స్వయం ఆర్థికాభివృద్ధి ప్రాజెక్టుగా అమరావతికి ప్రణాళికలు చేశామని, ఖర్చు లేకుండానే 33వేల ఎకరాల భూ సమీకరణ చేసి మౌళిక సదుపాయాలు సమకూర్చామన్నారు. అమరావతి నిర్మాణం పూర్తయితే రాష్ట్రమంతటికీ సంపద సృష్టి కేంద్రమవుతుందని తెలిపారు.
రాజధాని భూముల్లో ఎలాంటి ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరగలేదంటూ హైకోర్టు, సుప్రీంకోర్టు చెంప చెళ్లుమనిపించేలా తీర్పు చెప్పినా...వైకాపా నేతలు మూడేళ్ళ నుంచి ఒకే పాట పాడుతున్నారని తెలుగుదేశం నేతలు దుయ్యబట్టారు. 2014కు ముందు ఎసైన్డ్ భూములు ఎవరి పేరు మీద ఉంటే... వారికే పట్టాలు ఇచ్చేలా తెదేపా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఆ భూములు తమ పేరు మీదకు మారవని తెలిసి కూడా... నారాయణో, మరొకరో ఎందుకు కొంటారని ప్రశ్నించారు. విజయవాడలో కనకదుర్గ ఫ్లైవోవర్‌ని పూర్తి చేస్తే, తాను నిర్మించినట్టుగా జగన్ సభలో చెప్పడం ఆయన వైఖరిని తెలియజేస్తోందని ధ్వజమెత్తారు.
ఖర్చులేకుండా అమరావతిని సంపద సృష్టి కేంద్రంగా తీర్చిదిద్దుతాం. జగన్ సహా అందరి ఆమోదంతో అమరావతిని ఖరారు చేశాం. తెలుగుదేశం ఇదే అంశానికి ఇప్పటికీ కట్టుబడి ఉంది. అమరావతిపై ముఖ్యమంత్రి మాట తప్పారు. ఖర్చు లేకుండానే 33వేల ఎకరాల భూసమీకరణ చేశాం. స్వయం ఆర్థికాభివృద్ధి ప్రాజెక్టుగా అమరావతికి ప్రణాళికలు రూపొందించాం. టికెట్లు రావని కొంతమంది.. టికెట్లు ఇచ్చినా గెలవమని మరికొంతమంది వైకాపా ఎమ్మెల్యేలు భయపడుతున్నారు. -చంద్రబాబు, తెలుగుదేశం అధినేత
రైతులంతా రాజధాని విషయంలో ఏకమవటం చూసి తట్టుకోలేని జగన్... పబ్బం గడుపుకోవటం కోసమే మళ్లీ 3రాజధానులు అంశం తెరపైకి తెచ్చారని విమర్శించారు.
తెదేపా శాసనసభాపక్ష సమావేశంలో రాష్ట్రంలోని పలు అంశాల గురించి చర్చించిన తెదేపా అధినేత చంద్రబాబు... ప్రజా సమస్యలపై పోరాడుతున్న నేతలందరికి మళ్లీ టికెట్లు ఖాయమని స్పష్టం చేశారు. వైకాపా సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్లు ఇచ్చే ధైర్యం జగన్‌కు ఉందా అని ప్రశ్నించారు. ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను చూసి జగన్ తీవ్ర నిస్పృహలో ఉన్నారని, తన వైఫల్యాలన్నింటినీ పార్టీ ఎమ్మెల్యేలపైకి నెట్టివేయాలని చూస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు
ఇవీ చదవండి: