ముఖ్యమంత్రి, మంత్రులు ఉన్మాదంలో పోటీపడుతున్నారనటానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బెదిరింపులే ఉదాహరణని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆక్షేపించారు. మంత్రి వ్యాఖ్యలు రాజ్యాంగ ఉల్లంఘనేనని స్పష్టం చేశారు. మంత్రిగా ఉండేందుకు ఆయన అనర్హుడన్నారు. పాదయాత్రలో జగన్ చెప్పిన మాటలు, కేంద్రం మెడలు వంచుతానని చేసిన ప్రగల్భాలు ఏమయ్యాయంటూ నిలదీశారు. కేసుల మాఫీకి మోకరిల్లుతారా అని ప్రశ్నించారు. ఇంట్లో నోర్మూసుకుని పడుకునేందుకేనా 25మంది ఎంపీలను గెలిపించాలని కోరారా అంటూ నిలదీశారు. పార్టీ ఇంఛార్జిలు, ప్రజాప్రతినిధులతో ఎన్నికలపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు..వైకాపా దుర్మార్గాలపై ప్రజల్లో చైతన్యం పెంచాలని సూచించారు.
100 శాతం నామినేషన్లు వేయాలి
మూడో విడత ఎన్నికల్లో అన్ని గ్రామాల్లో వందశాతం నామినేషన్లు వేయాలన్న చంద్రబాబు..పరిశీలన, ఉపసంహరణల్లో అప్రమత్తంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. వైకాపా తప్పుడు పనులపై నిఘాపెట్టి బెదిరింపులన్నీ రికార్డు చేయాలన్నారు. గత 20నెలల్లో గ్రామాల్లో ఒక్క అభివృద్ధి పనీ చేయకపోగా తెదేపా హయాంలో చేసిన పనులన్నీ నిలిపివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ఊరికి వచ్చే 5ఏళ్లలో రూ.5కోట్లకు పైగా నిధులు వచ్చే అవకాశం ఉన్నందున వైకాపా బలపరిచే అభ్యర్థులు గెలిస్తే వాటిని స్వాహా చేస్తారని ఆక్షేపించారు. వైకాపా దోపిడీ దుర్మార్గాలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్న చంద్రబాబు..ప్రతి గ్రామంలో ఇసుక, మద్యం, భూ మాఫియా రెచ్చిపోతోందని మండిపడ్డారు. సొంత సిమెంట్ కంపెనీ లాభాల కోసం సిండికేట్ లతో సిమెంట్ ధరలు పెంచేశారనీ...., లక్షలాది భవన నిర్మాణ కార్మికుల జీవనోపాధిని దెబ్బతీశారని దుయ్యబట్టారు. సొంత మీడియా లాభాల కోసం, ప్రతిరోజూ ప్రకటనల పేరుతో ప్రజాధనం దోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ఎన్నికలతో బుద్ధి చెప్పాలి
అన్ని జిల్లాలలో వైకాపా నేతలు సహజ వనరుల్ని దోపిడీ చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఖనిజ సంపద మొత్తం దోచేస్తున్నారని..., ముగ్గురాయి, సున్నపు రాయి, బాక్సైట్, లేటరైట్, గ్రానైట్, సిలికా శాండ్ ఏది వదలట్లేదని మండిపడ్డారు. సహజ వనరుల దోపిడి చేస్తూ ప్రజాధనం స్వాహా చేసి సామాజిక సంపదల నాశనం చేయటమే వైకాపా ధ్యేయమని విమర్శించారు. కృష్ణపట్నం, మచిలీపట్నం, కాకినాడ పోర్టు, సెజ్ లలో అవినీతికి పాల్పడి ఇప్పుడు విశాఖ ఉక్కు పరిశ్రమపై పడ్డారని ధ్వజమెత్తారు. పోరాడి సాధించుకున్న ఆంధ్రుల హక్కునుబినామీల పరంచేసే కుట్రలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. పెట్టుబడిదారుల్ని రాష్ట్రం నుంచి తరిమేయటంతో ఏ పారిశ్రామికవేత్తా రాష్ట్రానికి రావట్లేదని దుయ్యబట్టారు. వైకాపా రైతాంగ వ్యతిరేక విధానాలకు ఈ ఎన్నికల్లో బుద్ది చెప్పాలని చంద్రబాబు కోరారు.
ఇదీ చదవండి: