తెలుగుదేశం న్యాయవిభాగం ప్రతినిధులు, పార్టీ ముఖ్యనేతలతో శుక్రవారం విడివిడిగా సమావేశమైన చంద్రబాబు నాయకులపై కేసులు, శ్రేణులపై దాడుల విషయంపై చర్చించారు. వైకాపా నేతలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నా ఎలాంటి కేసులు పెట్టకుండా ఏ తప్పూ చేయని తెదేపా నాయకులను అక్రమ కేసులతో వేధిస్తున్నారని మండిపడ్డారు. విజయవాడలో కుటుంబరావు సోదరుల భూమికి సంబంధించి సుప్రీంకోర్టు స్టేటస్‌కో ఆదేశాలు ఇచ్చినా ఆ స్థలంలో హెచ్చరిక బోర్డులు పెట్టి చట్టాలను తుంగలో తొక్కారని దుయ్యబట్టారు. 37ఏళ్ల క్రితం ఆస్తి వ్యవహారంలో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిని పోలీసుస్టేషన్‌కు పిలిపించి డాక్యుమెంట్లు చూపమంటూ వేధిస్తున్నారని ఆగ్రహం వెలిబుచ్చారు. ఎప్పుడో ఓబులాపురం గనుల అక్రమ తవ్వకాలపై పోరాడిన కేసులకు సంబంధించి చినరాజప్పపై, ఇతర నాయకులపైనా పాత కేసులు తవ్వితీసి ఈసీకి ఫిర్యాదులు పంపారన్నారు. "చలో ఆత్మకూరు" సందర్భంగా తమ ఇంటి సమీపంలో ఆంక్షలు లేని సమయంలో అచ్చెన్నాయుడు ఉల్లంఘించినట్లు తప్పుడు కేసు బనాయించారని, పోలీసు అధికారిని ఒక్కమాట అనకపోయినా నన్నపనేని రాజకుమారిపై అక్రమ కేసు పెట్టారని గుర్తుచేశారు.
కార్యకర్త హత్యను ఖండించిన చంద్రబాబు
నెల్లూరు జిల్లా అనాసాగరం మండలంలో జరిగిన తెదేపా నాయుకుడు వెంగయ్య హత్యను చంద్రబాబు ఖండించారు. నెల్లూరులో ఈ తరహా దాడులు గతంలో లేవని వైకాపా అధికారంలోకి వచ్చాక ప్రశాంతమైన జిల్లాలనూ రక్తసిక్తం చేస్తున్నారని ఆరోపించారు. జగ్గయ్యపేటలో పార్టీ కార్యకర్త సలీంపై కత్తులతో దాడి చేయడం, వడ్డెర మహిళ నరసమ్మపై దౌర్జన్యం, కడప జిల్లా జమ్మలమడుగులో 12ఎకరాల్లో పత్తి పంట నాశనం చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. పులివెందులలో నాగభూషణరెడ్డి ఇల్లు కూలగొడుతున్న ప్రభుత్వం కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తోందన్నారు. రాయదుర్గం పరిధిలోని బేలోడులో తెదేపా కార్యకర్తలపై దాడి పట్ల చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు. వినాయకుని నిమజ్జనం, మొహర్రం వేడుకలను దాడులకు వేదికలుగా మార్చుకుని ప్రశాంతంగా పండగ చేసుకునే పరిస్థితి లేకుండా చేశారని ధ్వజమెత్తారు.
బాధిత మహిళలకు భరోసా
గుంటూరు జిల్లా అమరావతి మండలం ఉంగుటూరు మహిళలు చంద్రబాబును కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. గత ఎన్నికల్లో తమ ఊళ్లో తెలుగుదేశానికి 500కు పైగా మెజార్టీ వచ్చిందని కక్షతో దాడులకు పాల్పడ్డారని చెప్పారు. రాళ్లు, నాటు కర్రలు, కొబ్బరిబోండాలతో మహిళలపై దాడి చేశారని వివరించారు. ఎవరూ ఆందోళన చెందవద్దని, పార్టీ తరఫున అండగా ఉంటామని వారికి చంద్రబాబు భరోసా ఇచ్చారు. ధైర్యంగా పోరాడాలని సూచించారు