Chandrababu met Governor: హెల్త్ యూనివర్సిటీకి ఛాన్సలర్‌గా ఉన్న గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు చెప్పకుండానే.. ఎన్టీఆర్ పేరు తొలగించారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. పేరు మార్పుపై గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేశామన్న చంద్రబాబు.. ఈ విషయం 'మీకైనా చెప్పారా' అని అడిగితే... తెలియదని గవర్నర్ ఆశ్చర్యపోయినట్లు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి చెల్లి షర్మిల కూడా పేరు మార్పు నిర్ణయాన్ని వ్యతిరేకించారన్నారు. ఎన్టీఆర్ పేరు మార్చి.. తన తండ్రి పేరు పెట్టడం సబబు కాదన్న షర్మిలకు ఉన్న విజ్ఞత కూడా జగన్‌కు లేదని విమర్శించారు. ఈ విషయాన్ని ఇంతటితో వదలమన్న చంద్రబాబు.. జాతీయ స్థాయిలో పోరాడతామని తెలిపారు. ఎవరి హయాంలో ఏయే కళాశాలలు వచ్చాయో వివరాలు బయట పెడుతున్నామన్నారు. కాసు బ్రహ్మానంద రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, కృష్ణకాంత్ తదితర మహనీయులను తెదేపా ప్రభుత్వం గుర్తించి పార్కులకు పెట్టిందని చంద్రబాబు గుర్తు చేశారు.
హెల్త్‌యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగింపుపై చీకటి చట్టం చేశారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ఎన్టీఆర్ పేరు మార్చటానికి జగన్‌రెడ్డికి మనసేలా వచ్చిందన్న ఆయన... తన తండ్రి ఆత్మతో మాట్లాడి నిర్ణయం తీసుకున్నారా అంటూ మండిపడ్డారు. ఎన్టీఆర్ కంటే రాజశేఖర్ రెడ్డి గొప్పవాడని చెప్పుకోవటానికి సిగ్గుపడాలన్నారు. అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మాత్రమేనని విమర్శించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగంపై ప్రమాణం చేసి చట్టసభల్లో అబద్ధాలు చెప్పారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎయిమ్స్‌ను అమరావతికి తీసుకొస్తే నీరు కూడా ఇవ్వకుండా వేధిస్తున్నారన్నారు. వైద్య రంగానికి జగన్మోహన్ రెడ్డికి మిగిల్చేది 3 మొండి గోడలు మాత్రమేనన్నారు. వైద్య రంగంలో ఎన్టీఆర్ తీసుకొచ్చిన సంస్కరణల కారణంగానే ఆయన పేరు యూనివర్సిటీకి పెట్టామని తెలిపారు. 24 ఏళ్లుగా ఎందరో విద్యార్థులు ఈ విశ్వవిద్యాలయం ద్వారా ఉన్నత చదువులు చదివారని చంద్రబాబు గుర్తు చేశారు.
"సీఎం జగన్ అనాగరిక చర్యలకు పాల్పడుతున్నారు. హెల్త్ యూనివర్శిటీ పేరు మారుస్తూ చీకటి జీవో తెచ్చారు. సినిమా, ఏపీ రాజకీయాల్లో ఎన్టీఆర్‌ది ప్రత్యేక స్థానం. 1986లో హెల్త్ యూనివర్శిటీని ఎన్టీఆర్ స్థాపించారు. కాకర్ల సుబ్బారావును అమెరికా నుంచి తీసుకువచ్చి వైద్య రంగాన్ని ప్రక్షాళన చేశారు. నేను సీఎంగా ఉన్నప్పుడు జిల్లాకొక మెడికల్ కాలేజీని తీసుకువచ్చా. జగన్ పాలనలో 3 వైద్య కళాశాలలకు గుర్తింపు మాత్రమే వచ్చింది. రాత్రి వాళ్ల నాన్న ఆత్మతో మాట్లాడి హెల్త్ యూనివర్శిటీ పేరు మార్చారా? ఎన్టీఆర్ కంటే రాజశేఖర్ రెడ్డి ఎలా గొప్ప వ్యక్తి? కొత్త మెడికల్ కాలేజ్ నిర్మించి రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టుకోవచ్చు. రాజశేఖర్ రెడ్డి, జగన్ కలిసి ఎన్ని మెడికల్ కాలేజీలు తీసుకువచ్చారో చెప్పాలి. సీఎం జగన్ ప్రభుత్వ వైద్య రంగాన్ని భ్రష్టు పట్టించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఔషధాలు లేవు, రోగులకు ఆహారం లేదు. నేను సీఎంగా ఉన్నప్పుడు కొన్నింటికి విపక్ష నేతల పేర్లు పెట్టాను. జగన్ నిర్ణయాన్ని వైఎస్ షర్మిల కూడా సమర్థించలేదు. ఎన్టీఆర్ పేరు మార్చి వైఎస్‌ఆర్ పేరు పెట్టడం సబబు కాదన్నారు. షర్మిలకు ఉన్న విజ్ఞత కూడా జగన్‌కు లేదు. యూజీసీ, మెడికల్ కౌన్సిల్ దృష్టికి సమస్యను తీసుకెళ్తాం."- చంద్రబాబు
ఇవీ చదవండి: