ఏలూరు ఘటనపై సీఎం జగన్‌కు చంద్రబాబు లేఖ రాశారు. ఏలూరు పరిధిలో 'ఆరోగ్య అత్యవసర పరిస్థితి' ప్రకటించాలని చంద్రబాబు కోరారు. ఏలూరులో జనజీవనం అల్లకల్లోలం కావడం ఆందోళన కలిగిస్తోందన్నారు. రోజుకో రీతిలో రోగుల్లో లక్షణాలు మారిపోవడంపై భయాందోళన వ్యకం చేశారు. కోలుకుని ఇంటికెళ్లిన కొందరిలో మళ్లీ అవే లక్షణాలు కనబడటం ఆందోళనకరంగా ఉందని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.
'ఏలూరు దుర్ఘటనలకు కారణాలు ఏమిటి. ఎందుకు, ఎలా జరిగింది, మూలాల అన్వేషణ జరపాలి. ఇప్పటివరకు చేపట్టిన పరీక్షల వివరాలను ప్రజలకు వెల్లడించాలి. బాధితుల్లో నమ్మకం పెంచి ప్రజలకు ధైర్యం చెప్పాలి. రేపు ఏం జరుగుతుందోననే భయాందోళనలను తొలగించాలి' - చంద్రబాబు
- ఎలక్ట్రానిక్ హెల్త్ కార్డులు అందజేయాలి..
తాగునీటిలో సీసం, నికెల్ ఉన్నాయనే సమాచారంతో ప్రజల్లో భయాందోళన చెందుతున్నారని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. గర్భిణులు, చిన్నారులు, వృద్ధుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిందని తెలిపారు. ఏలూరులో ప్రతిఒక్కరికి ఎలక్ట్రానిక్ హెల్త్ కార్డులు అందజేయాలని డిమాండ్ చేశారు. దీర్ఘకాలిక ప్రాతిపదికపై ప్రతి రోగిని నిశితంగా పర్యవేక్షించాలన్నారు. వైద్య నిపుణులతో బాధితులకు అత్యుత్తమ వైద్యం అందించాలని చంద్రబాబు లేఖలో కోరారు.
- ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలి..
'హెల్ప్‌లైన్' ఏర్పాటు ఆలోచన రాకపోవడం మరో వైఫల్యమని చంద్రబాబు ఆరోపించారు. తక్షణమే బాధితుల కోసం 'ప్రత్యేక కంట్రోల్ రూమ్' ఏర్పాటు చేయాలని కోరారు. సత్వర ఉపశమన, సహాయచర్యలు చేపట్టాలన్నారు. ప్రతి బాధితుడికి ఆరోగ్య బీమా, జీవిత బీమా కల్పించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్‌లో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలపైనా అధ్యయనం చేయాలని సూచించారు. ఆరోగ్య పరిరక్షణపై వారిలో అవగాహన పెంచాలని అన్నారు. 13 జిల్లాల్ల్లో తాగునీరు సురక్షితమో కాదో తక్షణమే ప్రత్యేక పరీక్షలు జరపాలని చంద్రబాబు సూచించారు. ఏలూరుతోపాటు రాష్ట్ర ప్రజలందరి ఆరోగ్యంపై భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం విఫలమైంది...
'సురక్షిత తాగునీరు పొందడం ప్రజల పౌరహక్కు. తాగునీటిని ప్రజలకు అందించడం ప్రభుత్వ కర్తవ్యం. నీటిని పొందడం పౌరుల ప్రాథమిక హక్కుగా సుప్రీంకోర్టు పేర్కొంది. సురక్షిత నీటి సరఫరాలో, పారిశుద్ధ్యంలో ప్రభుత్వం విఫలం కావడం శోచనీయం' -చంద్రబాబు
ఇదీ చదవండి:
వింత వ్యాధి: 'ఆరోగ్య శ్రీ' లోకి చేర్చుతూ ప్రభుత్వ ఉత్తర్వులు