హెల్మెట్ లేకుండా వెళ్తున్నారా? పోలీసులు పట్టుకుంటే రూ.100 జరిమానా చెల్లించి వెళ్లిపోవచ్చని అనుకుంటున్నారా? మున్ముందు అలా కుదరదు. రూ.వెయ్యి జరిమానా కట్టాల్సిందే. అంతేగాకుండా 3 నెలలపాటు మీ డ్రైవింగ్ లైసెన్సును అనర్హతలో పెడతారు. మోటారు వాహన చట్టంలో కేంద్రం తెచ్చిన సవరణల్లో ఇలాంటి నిబంధనలున్నాయి. వీటన్నింటినీ తప్పకుండా అమలు చేయాల్సిందేనని, మినహాయింపులు ఉండబోవని తాజాగా కేంద్రం స్పష్టతనిచ్చింది. మోటారు వాహన చట్టంలోని సెక్షన్ 177 నుంచి 199 వరకు కలిపి 31 సెక్షన్లలో సవరణలు తెచ్చింది.
ఈ సెక్షన్ల కింద ఉల్లంఘనలకు గతంకంటే జరిమానాలను భారీగా పెంచారు. కొన్నింటికి జరిమానాతోపాటు శిక్షలున్నాయి. ఈ సవరణ చట్టాన్ని గతేడాది సెప్టెంబరు ఒకటి నుంచి కేంద్రం అమల్లోకి తెచ్చింది. అయితే 11 సెక్షన్లలోని జరిమానాలను కొంతవరకు తగ్గించుకునేందుకు రాష్ట్రాలకు వెసులుబాటునిచ్చింది. మిగిలిన 20 సెక్షన్లలో జరిమానాలు భారీగా ఉండటంతో వీటిలోనూ వెసులుబాటుపై పలు రాష్ట్రాలు కేంద్రం దృష్టికి తీసుకెళ్లాయి. దీనిపై సుప్రీంకోర్టు నిపుణులతో ఓ కమిటీని వేసింది. చివరకు కేంద్రం తెచ్చిన సవరణ చట్టాన్ని అమలు చేయాల్సిందేనని.. దీన్ని భారంగా భావించకూడదని, ప్రమాదాల నివారణకు దోహదపడేదిగా చూడాలని పేర్కొన్నట్లు అధికారులు చెబుతున్నారు. కేంద్రం నుంచి స్పష్టత వచ్చినందున ఈ దస్త్రాన్ని రవాణాశాఖ ప్రభుత్వానికి పంపింది. సీఎం ఆమోదిస్తే నోటిఫికేషన్ విడుదల చేసి సవరణ చట్టాన్ని రాష్ట్రంలో అమలుచేయాల్సి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు.
ఇదీచదవండి: లద్దాఖ్ ప్రతిష్టంభనపై లోక్సభలో నేడు రాజ్నాథ్ ప్రకటన