Polavaram project: పోలవరం ప్రాజెక్టుపై జలశక్తి శాఖ సమన్వయ సమావేశం జరిగింది. సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్, ఈఎన్‌సీ హాజరయ్యారు. వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా జలశక్తి శాఖ సమావేశం నిర్వహించింది. వివిధ రాష్ట్రాలు కోర్టుల్లో దాఖలు చేసిన కేసులు, వివాదాలపై.. ఏపీ, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ అధికారులతో చర్చలు జరిపింది.
పోలవరం బ్యాక్‌వాటర్‌పై ఇప్పటికే అధ్యయనం చేయించామని కేంద్ర జల్‌శక్తి శాఖ స్పష్టం చేసింది. 2009, 2011లో శాస్త్రీయమైన సర్వేలు జరిగాయని తెలిపింది. ముంపుపై ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌కు అపోహలు ఉన్నాయని పేర్కొంది. భద్రాచలానికి ఎలాంటి ముంపు సమస్య లేదని, పోలవరం పూర్తయ్యాక మూడు రాష్ట్రాల్లోనూ ముంపు ఉండదని స్పష్టం చేసింది. ముంపు ప్రభావం లేకుండా కరకట్ట కట్టేందుకు ఏపీ సిద్ధపడిందని చెప్పింది. ప్రజాభిప్రాయ సేకరణకు ఒడిశా ముందుకు రాలేదని వెల్లడించింది.
బ్యాక్‌వాటర్‌పై మరోసారి సర్వే చేయించాలన్న తెలంగాణ ప్రభుత్వ వాదనను కేంద్ర జల్‌శక్తిశాఖ తోసిపుచ్చింది. ప్రస్తుతం 50 లక్షల క్యూసెక్కుల వరద వెళ్లేలా ప్రాజెక్టు నిర్మాణం ఉందని.. 36 లక్షల క్యూసెక్కులు వెళ్లేలా స్పిల్‌వే కట్టాలని ట్రైబ్యునల్ సిఫార్సు చేసిందని తెలిపింది. బ్యాక్‌వాటర్ సర్వేకు సాంకేతిక అంశాలపై చర్చించాలని కేంద్రం నిర్ణయించింది. అక్టోబర్ 7న నాలుగు రాష్ట్రాల ఈఎన్‌సీలతో భేటీ కావాలని జల్‌శక్తి శాఖ నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ వాదన: పోలవరం ప్రాజెక్టుపై.. తెలంగాణ ప్రభుత్వ వాదనలు ఆ రాష్ట్ర అధికారులు వినిపించారు. పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావంపై అధ్యయనం చేయించాలని తెలంగాణ తెలిపింది. స్వతంత్ర సంస్థతో సమగ్ర అధ్యయనం చేయించాలని కోరింది. పూర్తిస్థాయి నీటి నిల్వతో భద్రాచలం పరిసరాలకు ముంపు ఉందని పేర్కొంది. ముంపు నివారణకు రక్షణ చర్యలు తక్షణమే చేపట్టాలని కోరింది. రక్షణ చర్యల వ్యయాన్ని పోలవరం ప్రాజెక్టు అథారిటీ భరించాలని స్పష్టం చేసింది.
ఇవీ చదవండి: