కేంద్రం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీని తగ్గించడంతో భాజపా పాలిత రాష్ట్రాలూ వ్యూహాత్మకంగా పన్ను తగ్గింపు ప్రకటించాయి. తమ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్‌పై 7 రూపాయల మేర విలువ ఆధారిత పన్నును తగ్గించాయి. అసోం, త్రిపుర, కర్ణాటక, బిహార్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ ఈ విషయంలో ముందున్నాయి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు వ్యాట్ తగ్గించాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. కరోనా కారణంగా రవాణా రంగం రెండేళ్ల నుంచి తీవ్రమైన ఆటుపోట్లను ఎదుర్కొంది. ఇదే సమయంలో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు సుమారు 38 రూపాయల వరకు పెరగడం ఈ రంగాన్ని మరింత కుంగదీసింది.
GST పరిధిలోకి పెట్రోలియం ఉత్పత్తులను తీసుకొస్తే కొంత వరకైనా ధరాభారం తగ్గుతుందని ఆశిస్తే.. ఆ నిర్ణయాన్ని కేంద్రం వాయిదా వేసింది. కానీ ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడం కాస్త ఊరట ఇచ్చే అంశమే. తాము మనుగడ సాగించాలంటే కరోనా ముందున్న నాటి ధరలు ఉంటే తప్ప కోలుకోలేమని రవాణా అనుబంధ రంగాలు పేర్కొంటున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరల ప్రభావం... నిత్యావసరాల నుంచి అన్ని రకాల వస్తువుల ధరలు పెరగడానికి కారణమని అంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వ్యాట్ తగ్గించాలని కోరుతున్నాయి.
పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం ...డీలర్లను కంగుతినిపించింది. అప్పటికే బంకుల్లో పూర్తి నిల్వలు అందుబాటులో ఉన్న సమయంలో ఒక్కసారిగా ధర తగ్గుదలతో అనూహ్యంగా నష్టాలు ఎదుర్కొన్నారు. సామాన్యులపై పెరుగుతున్న భారం దృష్టిలో ఉంచుకుని ఈ ధరలు మరింత తగ్గితేనే మేలని.. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్‌పై తక్షణం ఓ నిర్ణయం తీసుకోవాలని పెట్రోలియం డీలర్లు విజ్ఞప్తి చేస్తున్నారు. పెట్రో ధరలపై వ్యాట్ ఎందుకు తగ్గించడం లేదని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది.
ఇదీ చూడండి: AMARAVATI PADAYATRA: అమరావతి పాదయాత్రకు హెచ్చరికలు.. భారీగా మోహరించిన పోలీసులు