Central government about Godavari tribunal : తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య గోదావరి జలాల పంపకంపై నూతన ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని రెండు రాష్ట్రాల నుంచి ఎటువంటి ప్రతిపాదన/విజ్ఞప్తి రాలేదని జల్‌శక్తి సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు తెలిపారు. నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఏడు ప్రాజెక్టుల డీపీఆర్‌లను తెలంగాణ, ఒక ప్రాజెక్టు డీపీఆర్‌ను ఆంధ్రప్రదేశ్ గోదావరి యాజమాన్య బోర్డుకు (జీఆర్‌ఎంబీ) సమర్పించాయని మంత్రి పేర్కొన్నారు. కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్-1లో కేటాయించిన జలాలతోనే కర్ణాటక అప్పర్ భద్ర ప్రాజెక్టు నిర్మాణం చేపడుతోందని బిశ్వేశ్వర్ తుడు తెలిపారు. చేవెళ్ల, పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్, మచిలీపట్నం ఎంపీలు గడ్డం రంజిత్‌రెడ్డి, బొర్లకుంట వెంకటేష్ నేత, మాలోత్ కవిత, పసునూరి దయాకర్, వల్లభనేని బాలశౌరి అడిగిన ప్రశ్నకు ఆయన ఈ సమాధానమిచ్చారు. కేడబ్ల్యూడీటీ-2 అనుమతులు వచ్చే వరకు ప్రాజెక్టు అనుమతులు ఖరారు చేయొద్దని ఏపీ, తెలంగాణ కోరాయని వెల్లడించారు. కేడబ్ల్యూడీటీ-1 కేటాయింపుల ఆధారంగా ప్రాజెక్టు చేపడుతున్నందున అంతరరాష్ట్ర వివాదాలు తలెత్తే అవకాశం లేదని పేర్కొన్నారు.
- ప్రధానమంత్రి ఉపాధి కల్పన (పీఎంఈజీపీ) కింద 2020-21లో తెలంగాణలో 2,025 మంది ప్రయోజనం పొందారని కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి నారాయణ రాణే తెలిపారు. మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.
- ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం (పీఎంజేవీకే) కింద తెలంగాణలో ఇప్పటి వరకు రూ.1,170.32 కోట్లతో గురుకుల పాఠశాలలు, కామన్ సర్వీస్ సెంటర్లు, వసతిగృహాలు, పాఠశాల భవనాలు, అదనపు తరగతి గదులు, మరుగుదొడ్ల పనులు చేపట్టినట్లు కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ తెలిపారు. చేవెళ్ల, పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్ ఎంపీలు గడ్డం రంజిత్‌రెడ్డి, వెంకటేష్ నేత, మాలోత్ కవిత, పసునూరి దయాకర్ అడిగిన ప్రశ్నకు ఈ సమాధానమిచ్చారు.
- అమృత్ కింద పార్కులు, హరిత విస్తరణ పనుల కింద రూ.35.69 కోట్లతో తెలంగాణలో 35 ప్రాజెక్టులు చేపట్టినట్లు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్ పూరీ తెలిపారు.
- జల వనరుల మరమ్మతు, నవీకరణ, పునరుద్ధరణ (ఆర్‌ఆర్‌ఆర్) కింద 2019-20, 2020-21ల్లో ఏపీ, తెలంగాణలకు నిధులు విడుదల చేయలేదని జల్‌శక్తి సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు తెలిపారు. మెదక్, భువనగిరి, కాకినాడ ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వంగా గీత అడిగిన ప్రశ్నకు ఈ సమాధానమిచ్చారు. ఏపీకి 2018-19లో రూ.2.70 కోట్లు, తెలంగాణకు 2017-18లో రూ.59.68 కోట్లు ఇచ్చినట్లు పేర్కొన్నారు.
- డ్యాం రిహాబిలిటేషన్, ఇంప్రూవ్‌మెంట్ ప్రాజెక్టు (డ్రిప్) కింద తెలంగాణలో 25 డ్యాంలకు రూ.545 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేసినట్లు జల్‌శక్తి సహాయ మంత్రి తెలిపారు.
తెలంగాణలో మందగమనంలో స్మార్ట్‌సిటీ పనులు
తెలంగాణలోని గ్రేటర్ వరంగల్, కరీంనగర్‌లలో స్మార్ట్‌సిటీ పనులు మందగమనంలో సాగుతున్నాయి. వరంగల్‌కు రూ.1,900 కోట్ల విలువైన 93 ప్రాజెక్టులు కేటాయించగా, ఇప్పటివరకు రూ.582 కోట్ల విలువైన 18 ప్రాజెక్టులు మాత్రమే పూర్తయ్యాయి. కరీంనగర్‌కు రూ.1,900 కోట్ల విలువైన 93 ప్రాజెక్టులు కేటాయించగా రూ.169.46 కోట్ల విలువైన 9 ప్రాజెక్టులు మాత్రమే పూర్తయ్యాయి. గురువారం లోక్‌సభలో కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి హర్‌దీప్‌సింగ్ ఇచ్చిన సమాధానం ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రస్తుతం వరంగల్‌లో రూ.433 కోట్ల విలువైన 17 పనులు, కరీంనగర్‌లో రూ.107 కోట్ల విలువైన 6 ప్రాజెక్టులు టెండర్ దశలో ఉన్నాయి. వర్క్ ఆర్డర్ స్థాయిలో వరంగల్‌లో రూ.595 కోట్ల విలువైన 38 ప్రాజెక్టులు, కరీంనగర్‌లో రూ.362 కోట్ల విలువైన 14 ప్రాజెక్టులు ఉన్నాయి. వరంగల్‌లో రూ.288 కోట్ల విలువైన 20 ప్రాజెక్టులు, కరీంనగర్‌లో రూ.970 కోట్ల విలువైన 33 ప్రాజెక్టులు డీపీఆర్ దశలోనే ఉన్నాయి.
ఇదీ చదవండి: MLC Ashok Babu Arrest: అశోక్‌బాబు అరెస్ట్‌పై తెదేపా నేతల ఆందోళన..పలువురు అరెస్ట్