కరోనా సన్నద్ధతపై కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ జాతీయ సర్వే నిర్వహించింది. మార్చి 25 నుంచి 30 వరకూ ఆన్‌లైన్ ద్వారా ప్రజాభిప్రాయాలు సేకరించింది. దీని ప్రకారం 92 శాతం మంది వైరస్‌ను తీవ్ర ముప్పు అని పేర్కొనగా... 3 శాతం మంది మాత్రమే ముప్పు కాదన్నట్టు వెల్లడించింది.
తెలుగు రాష్ట్రాల నుంచి మంచి స్పందన
ప్రధాని పిలుపునకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని... లాక్ డౌన్‌కు సహకరిస్తున్నారని నివేదికలో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 2014-18 సంవత్సరాల మధ్య ఉన్న ఐఏఎస్ అధికారులకు ప్రశ్నావళిని పంపిన కేంద్రం... వారు పంపిన సమాధానాల ఆధారంగా నివేదిక రూపొందించింది. దీనికోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక పోర్టల్‌లో 410 జిల్లాల కలెక్టర్లు నమోదు చేసుకోగా... 266 ఫీడ్‌బ్యాక్‌లు వచ్చినట్టు తెలిపింది. తెలుగు రాష్ట్రాల నుంచి చెప్పుకోదగ్గ స్థాయిలో స్పందనలు వచ్చినట్లు పేర్కొంది.
రాష్ట్ర ప్రభుత్వాల చర్యలు..
కొవిడ్‌పై ప్రజలు అప్రమత్తంగానే ఉన్నారని... ముందుజాగ్రత్తలు తీసుకున్నారని అధికారులు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌ల్లో వెల్లడైంది. లాక్‌డౌన్ ప్రశాంతంగా సాగుతోందని 69శాతం మంది అభిప్రాయపడగా... మిగతా వారు దానికి భిన్నంగా స్పందించారు. కొవిడ్‌ను ఎదుర్కోవడంలో కేంద్రం తగిన చర్యలు చేపట్టిందని 82 శాతం మంది కలెక్టర్లు, అధికారులు తెలపగా.... రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకున్నాయని 85 శాతం మంది వివరించారు. లాక్‌డౌన్ సమయంలో అత్యవసరాలు, నిత్యావసరాలు అందుబాటులో ఉన్నాయని 92 శాతం మంది కలెక్టర్‌లు ఫీడ్‌బ్యాక్ ఇచ్చినట్టు సర్వే నివేదిక వెల్లడించింది.
మూడు జిల్లాల్లో పరిస్థితి తీవ్రం..
రాష్ట్రంలో విశాఖ, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ప్రమాదకర పరిస్థితులు ఉన్నట్టు నివేదికలో పేర్కొన్నారు. విదేశాలు, పొరుగు రాష్ట్రాల సరిహద్దుల నుంచి కృష్ణా జిల్లాలోకి ప్రవేశించిన వారిని గుర్తించకపోవడం తీవ్రమైన లోపంగా పేర్కొంది. విశాఖ జిల్లాలో తగిన స్థాయిలో పీపీఈలు లేకపోవడాన్ని ప్రస్తావించింది.
ఇదీ చదవండి :