రాష్ట్ర ప్రజలకు తెదేపా అధినేత చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రాన్ని వైకాపా ప్రభుత్వం ‘‘పెనం మీదనుంచి పొయ్యిలోకి’’నెట్టిందని చంద్రబాబు ఆరోపించారు. వారం రోజుల్లోనే రాష్ట్రంలో కరోనా కేసులు రెట్టింపయ్యాయన్నారు. వైకాపా నాయకుల నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం వల్లే కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోందన్న చంద్రబాబు... మొదట తేలిగ్గా మాట్లాడటం, తర్వాత చేతగానితనం బయటపెట్టడం పాలకుల లక్షణం కాదన్నారు. అప్పుడు ‘కరోనా వస్తుంది, పోతుంది, పారాసిటమాల్, బ్లీచింగ్ చాలు’ అని తేలిగ్గా వ్యాఖ్యలు చేశారని చంద్రబాబు గుర్తు చేశారు. ఇప్పుడు ‘‘కరోనాతో కలిసి జీవిద్దాం, మన జీవనంలో ఇది కూడా అంతర్భాగం, మామూలు జ్వరం లాంటిదే ఇది’’ అనే వ్యాఖ్యలు పాలకుల డొల్లతనాన్ని బయటపెట్టాయని విమర్శించారు.
రైతులను ఆదుకోవాలని కోరినా ప్రభుత్వానికి పట్టలేదు
వలస కార్మికుల పరిస్థితి అత్యంత దుర్భరంగా మారిందని చంద్రబాబు ఆవేదన చెందారు. స్వస్థలాలకు వెళ్లేందుకు కాలినడకన వేల కిలోమీటర్లు నడిచి వెళ్లడం మనసు కలిచివేస్తోందన్నారు. భవన నిర్మాణ కార్మికులు, చేతివృత్తులవారు, ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయారన్నారు. రైతుల పరిస్థితి చూస్తుంటే గుండె తరుక్కుపోతుందన్న చంద్రబాబు... పండించిన పంటలు పొలంలో, రోడ్డుమీద వదిలేస్తున్నారన్నారు. పంట ఉత్పత్తులను ప్రభుత్వమే కొనాలని, మార్కెట్ ఇంటర్వెన్షన్ చేయాలని కోరామని చంద్రబాబు తెలిపారు. రైతులను ఆదుకోవాలని అనేక లేఖలు రాసినా ప్రభుత్వంలో స్పందన లేదని చంద్రబాబు విమర్శించారు. పొరుగు రాష్ట్రం కొన్న ధాన్యంలో పదో వంతు కూడా మన రాష్ట్రంలో కొనలేదన్నారు. పంట ఉత్పత్తులు ముందే సేకరిస్తే అకాల వర్షాలు, తుపాన్ల వల్ల రైతులకు నష్టం వాటిల్లేది కాదన్నారు.
'బాధ్యతాయుతమైన పార్టీగా ప్రజలకు తెదేపా అండగా ఉంటుంది. కరోనా తీవ్రతను ముందుగానే గుర్తించి, రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించాం. కంటైన్మెంట్ జోన్లలో కూడా వైకాపా నేతలు నిబంధనలు పాటించడం లేదు. నిర్లక్ష్యంగా, బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. అందువల్లే కరోనా వైరస్ రోజురోజుకూ ఉద్ధృతం అయింది. కరోనా కన్నా స్థానిక ఎన్నికలే ముఖ్యంగా వైకాపా నేతల ధోరణి ఉంది.'------- చంద్రబాబు, తెదేపా అధినేత
వైకాపా నేతల వల్ల కరోనా వ్యాప్తి
శ్రీకాళహస్తిలో ట్రాక్టర్లతో ర్యాలీలు జరపడం, నగరిలో పూలు జల్లుకుంటూ ప్రారంభోత్సవాలు జరపడం, పొరుగు రాష్ట్రం నుంచి అనుచరులను కనిగిరి ఎమ్మెల్యే తరలించడం, లాక్ డౌన్లో కూడా కొండెపిలో బహిరంగ సభలు పెట్టడాన్ని జాతీయ మీడియా తప్పుపట్టిందని చంద్రబాబు అన్నారు. వాలంటీర్ల వేతనాలకు వేల కోట్లు ఖర్చు చేస్తూ, ఇంటింటికీ రేషన్ సరకుల పంపిణీలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. చౌకడిపో క్యూలైన్లలో వందలాది మందిని క్యూలైన్లలో గంటల తరబడి నిలబెడుతున్నారని ఆక్షేపించారు. కరోనా వైరస్ వ్యాప్తికి ఇది మరో కారణమన్నారు.
కరోనా కిట్లలోనూ అవినీతి
లాక్ డౌన్‌లోనూ యథేచ్చగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయని చంద్రబాబు అన్నారు. హెల్త్ బులెటిన్లను ఫాల్స్‌గా మార్చారన్నారు. కరోనా కిట్లలోనూ అవినీతికి పాల్పడ్డారని ప్రజలకు రాసిన లేఖలో చంద్రబాబు తెలిపారు. కరోనా టెస్టింగ్‌లను నిర్లక్ష్యం చేయడమే రాష్ట్రంలో పెను విషాదానికి కారణమవుతుందన్నారు. నాసిరకం పీపీఈలతో కరోనా వైద్య సిబ్బందిని వైరస్‌పై యుద్ధానికి పంపడం ఆత్మహత్య సదృశమేనని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
వైఫల్యాలకు పరాకాష్ఠ
వైకాపా ఎంపీ కుటుంబంలో 6గురికి వైరస్ సోకడం, వారిలో 4 గురు డాక్టర్లు కావడం, గవర్నర్ నివాసం రాజ్ భవన్ లోనే పలువురికి వైరస్ సోకడం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలకు పరాకాష్ఠ అని చంద్రబాబు అన్నారు. రాజకీయ లాభాలపై ఉన్న శ్రద్ధ వైకాపా నేతలకు ప్రజారోగ్యంపై లేదని విమర్శించారు. స్థానిక ఎన్నికలపై ఉన్న ఆసక్తి, కరోనా వైరస్ నియంత్రణపై లేదని ఆరోపించారు.
ఇదీ చదవండి : ఇక ఇంటికి వెళ్లొచ్చు.. కానీ షరతులు వర్తిస్తాయి