న్యాయవ్యవస్థ, హైకోర్టు న్యాయమూర్తులపై సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టింగ్ అంశం(COMMENTS ABOUT JUDGES IN SOCIAL MEDIA)పై హైకోర్టు(high court) సోమవారం విచారణ జరిపింది. సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులు పెట్టిన వ్యవహారానికి సంబంధించిన కేసు దర్యాప్తు వివరాల్ని సీబీఐ డైరెక్టర్ సీల్డ్ కవర్లో హైకోర్టుకు నివేదించారు. ఆ నివేదిక ప్రతిని పిటిషనర్ / హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు అందజేయాలని ఆదేశించిన ధర్మాసనం... విచారణను డిసెంబర్ 13 కు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర , జస్టిస్ ఎం.సత్యనారాయణతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది.
న్యాయవ్యవస్థపై సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులు పెట్టడంపై అప్పటి ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్ జనరల్ దాఖలు చేసిన వ్యాజ్యంపై ధర్మాసనం విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ వ్యాజ్యంపై విచారణ సందర్భంగా నిందితులను పట్టుకోవడానికి , సామాజిక మాధ్యమాల నుంచి పోస్టులు తొలగించడానికి దర్యాప్తు ప్రారంభమైన మొదటి నుంచి ఏం చేశారో తెలియజేస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని సీబీఐ డైరెక్టర్‌ను హైకోర్టు ఆదేశించింది. అభ్యంతరకర వీడియోలను తొలగించే నిమిత్తం యూఆర్ఎల్ వివరాలను సామాజిక మాధ్యమ సంస్థలకు తెలియజేస్తున్నామని రిజిస్ట్రార్ జనరల్ పిటిషనర్ తరఫు న్యాయవాది ఎన్.అశ్వనీకుమార్ వాదనలు వినిపించారు. ఆ వివరాలను సీబీఐకి అందజేస్తున్నామన్నారు. ఆయా సంస్థలు తొలగిస్తున్నాయన్నారు. సీబీఐ డైరెక్టర్ సీల్డ్ కవర్లో కోర్టుకు నివేదిక ఇచ్చినట్లు తెలిసిందన్నారు.
అందుకే సీల్డ్ కవర్లో ఇచ్చాం..
సీబీఐ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ రాజు స్పందిస్తూ వివరాలు బహిర్గతం అయితే దర్యాప్తుపై ప్రభావం చూపుతుందన్న కారణంతో సీల్డ్ కవర్లో నివేదికను కోర్టుకు ఇచ్చామన్నారు. న్యాయస్థానం ఆదేశిస్తే పిటిషనర్‌కు ఇవ్వడానికి అభ్యంతరం లేదన్నారు. వాట్సాప్ , ఫేస్ బుక్ తరఫున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, ముకుల్ రోహతీ స్పందిస్తూ.. హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌తో సంప్రదించాక ఫలానా వీడియోలు , పోస్టులు తొలగించాలని సీబీఐ కోరితే తీసేస్తామన్నారు. యూఆర్ఎల్ అందజేస్తే తొలగించేందుకు అభ్యంతరం లేదన్నారు. అయితే సీబీఐ నేరుగా కోరలేదన్నారు. ఇప్పటికే పలు పోస్టులు తొలగించామన్నారు. గూగుల్ , యూట్యూబ్ తరఫున సీనియర్ న్యాయవాది సజన్ పూవయ్య వాదనలు వినిపిస్తూ .. అభ్యంతరకర పోస్టుల వివరాలు ఇస్తే తొలగిస్తామన్నారు. టీవీ చర్చా కార్యక్రమాల్లో న్యాయవ్యవస్థపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో అలాగే ఉంటున్నాయన్నారు. ఆ వీడియోల ఆధారంగా చేసుకొని పెడుతున్న అభ్యంతరకర వ్యాఖ్యానాలను తొలగిస్తున్నామన్నారు. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను డిసెంబర్ 13కు వాయిదా వేసింది. మరోవైపు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన వారిపై సుమోటోగా నమోదు చేసిన కేసును సైతం 13కు వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది.
ఇదీ చదవండి