అక్రమాస్తుల కేసులో నిందితుడు.. ముఖ్యమంత్రి అయినంత మాత్రాన కేసు పరిస్థితులు మారిపోవు అంటూ.. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి విషయంలో సీబీఐ ఘాటు వ్యాఖ్యలు చేసింది. అక్రమాస్తుల కేసులో తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ జగన్ తెలంగాణ హైకోర్టులో వేసిన పిటిషన్పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది.
సీఎం అయితే ఏంటి..?
ముఖ్యమంత్రి అనే హోదాను అడ్డుపెట్టుకుని జగన్ కోర్టు హాజరు నుంచి తప్పించుకుంటున్నారని పిటిషన్‌లో పేర్కొంది. వ్యక్తిగత హాజరు మినహాయింపు కోసం జగన్ పిటిషన్లు విచారణార్హం కాదని తెలిపింది. బెయిల్ షరతులను జగన్ అతిక్రమిస్తున్నారని కౌంటర్లో స్పష్టం చేసింది. కోర్టుకు హాజరు కావాలనే చట్టబద్ధమైన విధుల నుంచి ఏదో ఒక కారణంతో బయటపడాలని జగన్ ప్రయత్నిస్తున్నారని తెలిపింది. సీఆర్‌పీసీ సెక్షన్ 205ను ఉపయోగించి కోర్టుకు హాజరు కాకుండా చూస్తున్నారని అభియోగించింది. సీఎం అయ్యాక జగన్ ఒక్కసారే సీబీఐ కోర్టుకు వచ్చారని ఆక్షేపించింది. సహేతుక కారణం లేకుండానే మినహాయింపు కోసం జగన్ మళ్లీ పిటిషన్ వేశారని అభ్యంతరం తెలిపింది. జగన్ హోదా మారిందన్న కారణంగా మినహాయింపు ఇవ్వరాదని కోర్టును కోరింది.
జగన్ చట్టానికి అతీతుడు కారు
చట్టం ముందు.. సీఎం అయినా.. సామాన్యులైనా ఒకటేనని సీబీఐ పేర్కొంది. నిందితుడి హోదా మారినంత మాత్రాన కేసు పరిస్థితి మారినట్లు కాదని తెలిపింది. వారానికోసారి విజయవాడ నుంచి రావడం కష్టమనడం సమంజనం కాదని తెలిపింది. సీబీఐ, ఈడీ కలిపి వేసిన 16 చార్జిషీట్లలో జగన్ నిందితుడిగా ఉన్నారని, నిందితులుగా ఉన్న అధికారులు చాలా మంది జగన్ పాలన పరిధిలో ఉన్నారని సీబీఐ కోర్టు దృష్టికి తెచ్చింది. చట్ట రూపకర్తలు సైతం చట్టానికి లోబడే ఉండాలని స్పష్టం చేసింది.
సాక్షులను ప్రభావితం చేస్తారు
బెయిల్ సమయంలో అంగీకరించిన షరతులకు జగన్ కట్టుబడి ఉండాలని సీబీఐ పేర్కొంది. జగన్ కేసుల్లో ఇంకా అభియోగాలు నమోదు కావల్సి ఉందని.. ఒక వేళ హాజరు మినహాయింపునిస్తే కావల్సింది చేసే స్వేచ్ఛ జగన్‌కు లభిస్తుందని సీబీఐ కోర్టుకు తెలిపింది. దేశ ఆర్థికవ్యవస్థపై ప్రభావం చూపిన భారీ ఆర్థిక కుంభకోణంలో జగన్ ప్రమేయం ఉందన్న సీబీఐ... దీనిని దృష్టిలో ఉంచుకొని ఆయనకు హాజరు మినహాయింపు ఇవ్వొద్దని ధర్మాసనాన్ని కోరింది. పిటిషన్‌లో పేర్కొన్నట్లు రాష్ట్ర విభజన, జగన్ రాజకీయ ప్రస్థానంతో ఈ కేసుకు సంబంధం లేదని సీబీఐ స్పష్టం చేసింది. ఆర్థికనేరాల్లో ప్రధాన నిందితుడు ఉన్న జగన్.. చట్టానికి అతీతుడిగా నిలబడవచ్చా అని ప్రశ్నించింది. హాజరు మినహాయింపు పొంది.. బెయిల్ ఇచ్చిన కోర్టులోనే విచారణకు దూరం ఉండొచ్చా అని నిలదీసింది.
ఉద్యోగులను పెట్టుకున్నారు
ప్రతిసారీ కేసుల నుంచి హాజరు తప్పించుకోవడానికి జగన్ ఏదో ఒక సాకు చెబుతున్నారని సీబీఐ ఆక్షేపించింది. కోర్టుకు హాజరయ్యేందుకు తన కంపెనీల ప్రతినిధులుగా కిందిస్థాయి ఉద్యోగులను నియమించారని ఆరోపించింది. తన కంపెనీల ద్వారా క్విడ్‌ప్రొకో లబ్ధి పొందింది జగనే అని అభియోగం చేసింది. రాజకీయ, ధన బలాన్ని ఉపయోగించి జగన్ సాక్షులను ప్రభావితం చేస్తారన్న సీబీఐ.. విచారణ ప్రక్రియ కనుచూపు మేరకు అందనంత దూరం వెళ్తుందని పేర్కొంది. మొదటి చార్జిషీట్ దాఖలై ఎనిమిదేళ్లయినా ఇప్పటికీ విచారణ ప్రారంభం కాలేదన్న సీబీఐ.. జగన్, ఇతర నిందితులు ఏదో ఒక నెపంతో విచారణ ప్రక్రియను జాప్యం చేస్తున్నారని ఆరోపించింది. రకరకాల కారణాలతో వివిధ కోర్టుల్లో జగన్, ఇతర నిందితులు పిటిషన్లు వేస్తున్నారని సీబీఐ కోర్టుకు తెలిపింది. ఆలస్యం జరుగుతోందంటూ తిరిగి జగనే మినహాయింపు కోరుతున్నారని సీబీఐ కౌంటరులో చెప్పింది.
ఇదీ చదవండి: