ఏపీ హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పులపై ప్రసార, సామాజిక మాధ్యమాల్లో పలువురు అభ్యంతరకర, అసభ్య పదజాలంతో కూడిన వ్యాఖ్యలు చేస్తున్న అంశాన్ని సుమోటోగా తీసుకుని రెండు రోజుల కిందట న్యాయస్థానం విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. వ్యాఖ్యలు చేసిన 49 మందిని గుర్తించి వారికి న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. వారిలో ఏడుగురిపై కేసులు నమోదయ్యాయి. మిగతా వారికి సంబంధించి ప్రస్తుతం విచారణ సాగుతోందని సీఐడీవర్గాలు తెలిపాయి.
కేసులు నమోదైనవారు..
దరిశ కిషోర్‌రెడ్డి, లింగారెడ్డి, జి.శ్రీధర్‌రెడ్డి, అవుతు శ్రీధర్‌రెడ్డి, జలగం వెంకట సత్యనారాయణ, చందురెడ్డి, శ్రీనాథ్ సుస్వరం... కేసులు నమోదైన వారిలో ఉన్నారు. వీరిపై ఐటీ చట్టంలోని సెక్షన్ 67, ఐపీసీ 505(2), ఐపీసీ 506, ఐపీసీ 153(ఏ)సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేశారు.
నేరం రుజువైతే...
- ఐటీ చట్టం-2000 సెక్షన్ 67: ఎలక్ట్రానిక్, డిజిటల్ మాధ్యమాల్లో అశ్లీల సందేశాల్ని ప్రచురించటం, పంపించటం. మొదటిసారి ఈ నేరానికి పాల్పడితే మూడేళ్ల వరకూ జైలు శిక్ష, రూ.5 లక్షల వరకూ జరిమానా. రెండోసారి నేరం చేస్తే అయిదేళ్ల వరకూ జైలు శిక్ష, రూ.10 లక్షల వరకూ జరిమానా.
- ఐపీసీ 505 (2): కులాలు, మతాలు, జాతులు, ప్రాంతాలు, వర్గాల మధ్య వైషమ్యాలు, శత్రుత్వం సృష్టించే వ్యాఖ్యలు చేయటం, వదంతులు వ్యాప్తి చేయటం, వాటిని ప్రచురించటం. ఈ నేరానికి మూడేళ్ల వరకూ జైలు శిక్ష, జరిమానా. ఈ బెదిరింపులు మృతికి, ఆస్తుల ధ్వంసానికి కారణమైతే జీవితకాల శిక్ష.
- ఐపీసీ 506: నేరపూరిత బెదిరింపు: రెండేళ్ల వరకూ జైలుశిక్ష, జరిమానా.
- ఐపీసీ 153 ఏ: లిఖితపూర్వకంగా, మౌఖికంగా లేదా సంజ్ఞల ద్వారా కులాలు, మతాలు, జాతులు, ప్రాంతాలు, వర్గాల మధ్య వైషమ్యాలు, శత్రుత్వం సృష్టించే చర్యలకు పాల్పడటం. అయిదేళ్ల వరకూ జైలుశిక్ష, జరిమానా.
రాజ్యాంగబద్ధ సంస్థలపై వ్యాఖ్యలు గర్హనీయం : డీజీపీ
రాజ్యాంగబద్ధ సంస్థలు, వాటి నిర్వహణలో ఉన్న వ్యక్తుల పట్ల అభ్యంతరకర, అసభ్య, నిందాపూర్వక వ్యాఖ్యలు చేయటం గర్హనీయమని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. అలాంటి చర్యలకు పాల్పడే వ్యక్తుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, చట్ట ప్రకారం వ్యవహరిస్తామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి : మహానాడు 2020.. మెుదటి రోజు సాగిందిలా..!