ఎన్నికలంటే నాయకులు.. కార్యకర్తలు ఫోన్లలో బిజీబిజీ ఉంటారు. తమ ప్రణాళికలు తదితర అంశాలను చర్చించుకుంటారు. కానీ తెలంగాణలోని హుజూరాబాద్(Huzurabad by election)లో మాత్రం పరిస్థితి దీనికి పూర్తిగా భిన్నం. చరవాణిలో మాట్లాడాలంటేనే నాయకులు హడలిపోయే (Huzurabad Cellphone Fear) పరిస్థితి నెలకొంది. ఏదైనా సరే ముఖాముఖిగా మాట్లాడుకోవడమే ఉత్తమం అనే ఫార్ములా ఈ ఉపఎన్నికల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ప్రధాన పార్టీల అభ్యర్థులైతే ఫోన్లను వాడటమే గగనమై పోయింది. ఒకరి వాయిస్ రికార్డు చేసి మరోచోట రేటును పెంచుకుంటున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. చరవాణి బేరాలకు ఎందుకు అవకాశం కల్పించాలనుకుంటున్నారో? లేదా తాము మాట్లాడుతున్నట్లు మరెవరైనా వింటున్నారనే అనుమానం వస్తుందో కానీ మొత్తానికి ఈ ఎన్నికల్లో సెల్‌ఫోన్ల వినియోగం బాగా తగ్గింది.
వ్యూహం ప్రత్యర్థులకు తెలియకుండా జాగ్రత్తలు...
ప్రస్తుత ఆధునిక యుగంలో ప్రత్యక్షంగా వెళ్లి వచ్చే కంటే చరవాణి(Cellphone)ని ఉపయోగిస్తే పోలా అనుకుంటాం. కాని హుజూరాబాద్ ఉప ఎన్నిక(Huzurabad by election)ల్లో మాత్రం పరిస్థితి దీనికి భిన్నంగా సాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అందరిని ఆకర్షిస్తున్న హుజూరాబాద్ ఎన్నికల్లో గెలుపు కోసం ప్రధాన పార్టీలు అహర్నిశలు కృషి చేస్తున్నాయి. బరిలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేసేందుకు తమ కార్యాచరణ, వ్యూహాలను అమలు చేసేందుకు ప్రధానంగా సెల్‌ఫోన్లను వినియోగిస్తుంటారు.
ఈ ఉపఎన్నికల్లో ప్రత్యర్థుల వ్యూహాలను చిత్తు చేసేందుకు అందుబాటులో ఉన్న అవకాశాలను వినియోగిస్తుండటంతో చరవాణిని ఎంత తక్కువ ఉపయోగిస్తే అంత మంచిది అనుకుంటున్నారు. ప్రస్తుతం పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు అధికార పార్టీకి ఉన్న అధికార దుర్వినియోగం చేస్తోందని అనేక విమర్శలు ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ చేస్తూ తమ సీక్రెట్లను వింటున్నారని ప్రతి ఎన్నికల సమయంలోనూ చూస్తూ ఉంటాం. ఆ ఫార్ములాను ఈ ఎన్నికల్లో ఉపయోగించుకుంటారేమోనని హుజూరాబాద్ ఎన్నికల సందర్భంగా కూడా ఫోన్లో మాట్లాడాలంటే ప్రధాన పార్టీల నేతలు వణికిపోతున్నారు.
సెల్‌ఫోన్ జోలికి వెళ్లని ఈటల...
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో భాజపా, తెరాస (BJP VS TRS) ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. మొన్నటి వరకు భాజపా, తెరాస మాత్రమే ఢీ అంటే ఢీ అనేలా అన్నాయి. తాజాగా వారిద్దరినీ టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ (Congress) ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తోంది. అభ్యర్థులు తాము ఏం చేసినా ప్రత్యర్థులకు తెలిసిపోతుందన్న భయం రాజకీయ పార్టీలను వెంటాడుతోంది. ముఖ్యంగా భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ (Bjp Candidate Etela Rajender) ఫోన్ అస్సలు వినియోగించడం లేదు. ఏదైనా ముఖాముఖిగా మాత్రమే మాట్లాడుతున్నారు. వాట్సాప్ కాల్, ఐఫోన్లో ఉండే ఫేస్యాప్లను తొలుత ఉపయోగించినా ఇప్పుడు మాత్రం అసలు ఫోన్ జోలికే వెళ్లడం లేదని ప్రచారం జరుగుతోంది. ఒకరిద్దరి ఫోన్లలో మాట్లాడుతున్నా.. కేవలం బహిరంగ విషయాలు మాత్రమే ఫోన్లలో మాట్లాడుతున్నట్లు ప్రచారంలో ఉంది.
అధికార పార్టీలోనూ చరవాణి గుబులే..
అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, మండలాల ఇంఛార్జీలు కూడా ఫోన్లలో మాట్లాడం లేదు. ఏ సమాచారం ఇవ్వాలనుకున్నా.. తమ పీఆర్వోలకే వివరాలు చెప్పేస్తున్నారు. అత్యవసరమైతే తప్ప హలో అనడానికే ఆలోచించే పరిస్థితి నెలకొంది. తెరాస పార్టీ టెలికాన్ఫరెన్స్‌ల్లో మాత్రమే పాల్గొంటోంది. మిగతా అంశాలను ఫోన్లలో మాట్లాడటానికే ఇష్టపడటం లేదు. అధికార పార్టీ ఈటల రాజేందర్‌తో ఢీ అంటే ఢీ అంటూ తెరాస ప్రచారంలో దూకుడు పెంచింది.
ఈ క్రమంలో ఏదైనా ఫోన్ సంభాషణ బయటకు లీక్ అయితే ఎలాంటి పరిణామాలు ఉంటాయోనన్న ఆలోచన కలవరపెడుతోంది. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం ఎందుకని ముందే జాగ్రత్త పడుతోంది. కాంగ్రెస్ నేతలు కూడా ఫోన్ల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఏదైనా మాట్లాడాలంటే మాత్రం తమ అనుయాయులతో వచ్చి మాట్లాడమని చెప్పుకుంటూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏ విషయమైనా ఇప్పుడు ఆ విషయం ఫోన్లో ఎందుకులే కలిసినప్పుడు మాట్లాడుకుందామని చెబుతున్నట్లు ప్రచారంలో ఉంది.