ముఖ్యమంత్రి జగన్.. దిల్లీ పర్యటన కారణంగా ఇవాళ జరగనున్న మంత్రి మండలి సమావేశంలో కాస్త మార్పులు చేశారు. ఉదయం 10.30 గంటలకే సచివాలయంలో మంత్రి మండలి భేటీ కానుంది. కీలక ప్రతిపాదనలపై చర్చించనుంది. జగనన్న విద్యా కానుక కింద విద్యార్థులకు స్కూల్ బ్యాగుల పంపిణీ.. 3 జతల యూనిఫాం, 2 జతల బూట్లు, నోటు పుస్తకాలు ఇచ్చే ప్రతిపాదనపై నిర్ణయం తీసుకోనుంది.
కీలక ప్రతిపాదనలు
ఎర్రచందనం కేసుల విచారణకు తిరుపతిలో ప్రత్యేక కోర్టు ఏర్పాటుకు ప్రతిపాదన.. సీపీఎస్‌పై జరిగిన ర్యాలీల్లో నమోదైన కేసులు రద్దు.. స్టేట్ అగ్రికల్చర్ కౌన్సిల్ ఏర్పాటు.. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ 20 రోజులకు కుదింపు.. ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ ముసాయిదా బిల్లు.. 10 వేల మెగావాట్ల సౌరవిద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా చర్యలపై.. ప్రతిపాదనలు మంత్రి వర్గం ముందుకు రానున్నాయి.
సమావేశం అనంతరం దిల్లీ పర్యటన
సమావేశం ముగియగానే.. ముఖ్యమంత్రి గన్నవరం విమానాశ్రయం నుంచి దిల్లీకి వెళ్లనున్నారు. సాయంత్రం 4 గంటల తర్వాత ప్రధాని మోదీని కలుస్తారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కలిసే అవకాశం ఉంది. ఈ సమావేశాల అనంతరం రాత్రి విజయవాడకు తిరుగు ప్రయాణమవుతారు.